ధర్మపరమైన నిషేధాలు – 24: ఎక్కడ అల్లాహ్ యేతరుల కొరకు జంతుబలి జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు జంతుబలి చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[6:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు – 24

24- ఎక్కడ అల్లాహ్ యేతరుల కొరకు జంతుబలి జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు జంతుబలి చేయకు.

عَن ثَابِتِ بْنِ الضَّحَّاكِ قَالَ: نَذَرَ رَجُلٌ عَلَى عَهْدِ رَسُولِ الله أَنْ يَنْحَرَ إِبِلًا بِبُوَانَةَ فَأَتَى النَّبِيَّ فَقَالَ: إِنِّي نَذَرْتُ أَنْ أَنْحَرَ إِبِلًا بِبُوَانَةَ فَقَالَ النَّبِيُّ : (هَلْ كَانَ فِيهَا وَثَنٌ مِنْ أَوْثَانِ الْجَاهِلِيَّةِ يُعْبَدُ؟) قَالُوا: لَا قَالَ: (هَلْ كَانَ فِيهَا عِيدٌ مِنْ أَعْيَادِهِمْ؟) قَالُوا: لَا قَالَ: رَسُولُ الله : (أَوْفِ بِنَذْرِكَ فَإِنَّهُ لَا وَفَاءَ لِنَذْرٍ فِي مَعْصِيَةِ اللَّهِ وَلَا فِيمَا لَا يَمْلِكُ ابْنُ آدَمَ).

సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాడు. అతను ప్రవక్త వద్దకు వచ్చి “నేను ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కు- కున్నాను. (నా మ్రొక్కును పూర్తి చేయాల వద్దా అని ప్రశ్నిం- చాడు). “అజ్ఞాన కాలం నాటి ఏదైనా విగ్రహ పూజ అక్కడ జరుగుతుందా?అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని ప్రజలన్నారు. “అయితే వారి పండుగ, ఉత్సవాలు ఏమైనా అక్కడ జరుగుతాయా?అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని వారన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీ మ్రొక్కును పూర్తి చేయి. అల్లాహ్ కు అవిధేయతలో ఉన్న ఏ మ్రొక్కూ పూర్తి చేయవద్దు. అలాగే మనిషి అధికారంలో లేని మ్రొక్కు కూడా పూర్తి చేయకూడదు”. (అబూ దావూద్/ బాబు మా యుఅమరు బిహీ మినల్ వఫాఇ… 3313).

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu

ధర్మపరమైన నిషేధాలు (పాయింట్స్ క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb

అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

10వ అధ్యాయం
అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం)
[Slaughtering for other than Allah]

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.” (అన్ ఆమ్ 6: 162,163).

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

“నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు.” (కౌసర్ 108: 2).

అలీ (రజియల్లాహు అన్హు)  కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:

  • (1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
  • (4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.

(ముస్లిం).

తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.

అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.”

(అహ్మద్).

ముఖ్యాంశాలు:

  1. మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  2. రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  3. శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
  4. తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
  5. “ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
  6. భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
  7. ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
  8. ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
  9. అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
  10. విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
  11. నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
  12. ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ  (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
  13. ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).

షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.

అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం, కానుకలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్
عقيدة التوحيد
అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) – మూడవ ప్రకరణం
సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం. కానుకలు, నజరానాలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం

బహుదైవారాధన వైపు తీసుకుపోయే మార్గాలన్నింటినీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూసివేశారు. ఆ మార్గాలకు దూరంగా ఉండవలసిందిగా సావధానపరిచారు. అలాంటి వాటిలో సమాధులు కూడా ఉన్నాయి. సమాధిపూజ, సమాధివారల పట్ల అతిశయిల్లటం మొదలగు విషయాలలో కట్టుదిట్టమయిన నిబంధనలను కూడా నిర్ధారించారు. వాటిలో కొన్ని ఇవి:

1. ఔలియాల, మహనీయుల, సత్పురుషుల యెడల అభిమానంలో మితిమీరి వ్యవహరించటాన్ని గురించి ఆయన హెచ్చరించారు. ఎందుకంటే ఈ మితిమీరటమే (అతివాదమే) క్రమక్రమంగా వారి ఆరాధన వైపు తీసుకుపోతుంది.

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

grave-worship-1

మీరు అభిమానంలో అతిశయిల్లకండి. ఎందుకంటే ఈ అతివాదమే (ఘులూ) మీ పూర్వీకులను అంతమొందించింది.” (అహ్మద్, తిర్మిజీ, ఇబ్నుమాజా-3029 సహీహ్)

వేరొక హదీసులో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు.

grave-worship-2

“క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా (ఏసుక్రీస్తు) అభిమానంలోఅతిశయిల్లి (ఆయన్ని అల్లాహ్ కుమారునిగా చేసి)నట్లుగా మీరు నా విషయంలో అతిశయిల్లకండి (నన్ను నా పరిమితులను దాటనివ్వకండి). నేను అల్లాహ్ దాసుడను. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడని, ప్రవక్త అనీ అనండి.” (సహీహ్ బుఖారీ)

(2) సమాధులను పటిష్ఠపరచటాన్ని, వాటిపై కట్టడాలను కట్టడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. అబుల్ హయాజ్ అల్ అసదీ గారి కథనం ద్వారా మనకు తెలిసేది ఇదే. అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) తనతో ఇలా చెప్పారని ఆయన తెలిపారు –

grave-worship-3

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను ఏ పనిపై పంపారో ఆ పనిపై నేను మిమ్మల్ని పంపనా? అదేమిటంటే ఏ విగ్రహం కనిపించినా మీరు దానిని పడగొట్టాలి. ఏ సమాధి ఎత్తుగా కనిపించినా మీరు దానిని సమం చేసివేయాలి.” (సహీహ్ ముస్లిం)

(3) సమాధులను పటిష్ఠపరచటాన్ని, వాటిపై నిర్మాణాలు చేయటాన్ని కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు :

“సమాధిని పక్కాగా నిర్మించటాన్ని, దానిపై కూర్చోవటాన్ని, దానిపై కట్టడం కట్టడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు.” (ముస్లిం)

(4) సమాధుల వద్ద నమాజ్ చేయటాన్ని కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ::

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరణ సూచనలు ప్రస్ఫుటం అయినపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ముఖంపై దుప్పటి కప్పుకోసాగారు. ఊపిరాడక పోవటంతో దుప్పటిని తొలగించారు.ఆ స్థితిలోనే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

“యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ శాపం పడుగాక! వారు తమ ప్రవక్తల సమాధులనే సాష్టాంగ (సజ్జా) స్థలంగా చేసుకున్నారు.” వారి చర్య గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జనులను సావధానపరిచేవారు. ఈ వ్యవహారంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంత దృఢంగా ఉండకపోతే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిపట్ల కూడా అలాగే చేసేవారేమో!

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా తాకీదు చేశారు :

grave-worship-5

“వినండి. మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా (సజ్దా) స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోకండి. నేను దీని నుండి మిమ్మల్ని వారిస్తున్నాను.” (సహీహ్ ముస్లిం)

సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోవటం అంటే భావం అక్కడ మస్జిద్ లేకపోయినప్పటికీ అక్కడ నమాజ్ చేయటం. నమాజ్ కోసం సంకల్పం చేసుకున్న ప్రతి స్థలం సాష్టాంగ ప్రణామ స్థలం – ఆరాధనా స్థలం – అవుతుంది. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు : –

grave-worship-6

“నా కొరకు భూమండలమంతా మస్జిద్ (సాష్టాంగ స్థలం)గా, పరిశుద్ధత పొందే స్థలంగా చేయబడింది.” (సహీహ్ బుఖారీ)

కాబట్టి సమాధిపై మస్జిద్ ని నిర్మిస్తే, వ్యవహారం చాలా సంక్లిష్టమైపోతుంది. కాని చాలామంది వారించబడిన ఈ విషయాలను ఉల్లంఘించారు. ఏ ఏ పనులు చేయరాదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గట్టిగా తాకీదుచేశారో  వాటికి ఒడిగట్టారు. తత్కారణంగా వారు పెద్ద తరహా షిర్క్ కు పాల్పడిన వారయ్యారు. వారు సమాధులపై మస్జిదులను, విశ్రాంతి స్థలాలను నిర్మించారు. సమాధులను సందర్శనా క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. పెద్ద తరహా షిర్క్ (షిర్కె అక్బర్) గా పరిగణించబడే పనులన్నీ అక్కడ యధేచ్ఛగా జరుగుతాయి. ఉదాహరణకు : జంతువులను బలి ఇవ్వటం, సమాధిలో ఉన్న మృతుల ముందు చేయిచాచి అర్థించటం, ఫిర్యాదులు చేసుకోవటం, మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం, నజరానాలు సమర్పించటం ఇత్యాదివి.

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “ఏ వ్యక్తి అయినా సమాధుల గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి విధానాన్ని, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశాలను, నిషేధాజ్ఞలను, వాటికి ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కట్టుబడిన తీరును అధ్యయనం చేసి, అదే సమయంలో నేటి ప్రజలలో చాలామంది (అంటే ఇబ్నుల్ ఖయ్యిమ్ గారి సమకాలికులు) అవలంబిస్తున్న పోకడల్ని పోల్చిచూసుకుంటే ఆ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య అసలు పొంతనే కనిపించదు. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధుల వద్ద నమాజ్ చేయరాదని తాకీదు చేశారు. కాని వీళ్ళు అక్కడ నమాజ్ చేస్తున్నారు. సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోవటాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. కాని వీళ్ళు సమాధిపై ఆరాధనా కట్టడం నిర్మిస్తున్నారు. దేవుని ఆరాధనా స్థలాలను పోలిన కట్టడాలను నిర్మించి వాటికి ‘దర్గాహ్’ అని నామకరణం చేస్తున్నారు. సమాధులపై దీపాలంకరణ చేయటాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించగా, వీళ్ళేమో దీపాలు వెలిగిస్తూ ఉండటానికి ఆస్తులను వక్ఫ్ చేస్తున్నారు. సమాధులను ఉత్సవ స్థలాలుగా చేయరాదని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాకీదు చేశారు. కాని ఈ మహానుభావులు సమాధులను ఉత్సవాలకు, ఉరుసులకు, మేళాలకు ప్రత్యేకించుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.

సమాధులను (నేలకు) సమంగా చేయమని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించి నట్లుగా ఇమామ్ ముస్లిం తన ప్రామాణిక గ్రంథంలో పొందుపరిచారు. అబుల్ హయాజుల్ అసదీ కథనం : అలీ బిన్ అలీ తాలిబ్ (రదియల్లాహు అన్హు)తనతో ఇలా అన్నట్లు ఆయన తెలిపారు:

grave-worship-7

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను ఏ పనిపై పంపారో, ఆ పనిపై నేను మిమ్మల్ని పంపనా!? అదేమంటే ఏ విగ్రహం కనిపించినా దానిని రూపుమాపాలి. ఏ సమాధి ఎత్తుగా ఉన్నట్లు కనిపించినా దానినినేలమట్టం చేయాలి.” (సహీహ్ ముస్లిం)

సహీహ్ ముస్లింలోనే సుమామ బిన్ షుఫా కథనం ఇలా ఉంది : “మేము ఫుజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) వెంట రోము రాజ్యంలో ‘రూడ్స్’ అనే ప్రదేశంలో ఉండగా మా సహవాసుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి సమాధిని భూమికి సమంగా చేయమని ఫుజాలా (రదియల్లాహు అన్హు) ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నారు : “సమాధులను నేలకు సమంగా ఉంచమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించటం నేను స్వయంగా విన్నాను.”

కాని వీళ్లు ఈ రెండు హదీసులను వ్యతిరేకిస్తూ, అతిగా ప్రవర్తిస్తున్నారు. తమ నివాస గృహాల మాదిరిగా సమాధులను కూడా బాగా ఎత్తుగా నిర్మిస్తున్నారు. వాటిపై డోములు అమర్చుతున్నారు.

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇంకా ఇలా అంటున్నారు : సమాధులకు సంబంధించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏఏ ఆదేశాలిచ్చారో, మరే నిషేధాజ్ఞలు జారీ చేశారో వాటి వెలుగులో చూస్తే, ఈ సమాధి పూజారులు కల్పించుకున్న విధానాలకు – ప్రవక్త విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ల పోకడలో ఉన్న అరిష్టాలను లెక్కించటం మనిషి తరం కాదు.

తరువాత ఆయన ఈ అనర్థదాయక విషయాలను గురించి చెబుతూ ఇలా అన్నారు: సమాధుల సందర్శన సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ ఏ విషయాలను అనుమతించారో కాస్త చూడాలి. సమాధుల సందర్శనలోని ముఖ్య ఉద్దేశం పరలోకాన్ని స్మరించుకోవటం! సమాధిలో ఉన్న మృతుని మన్నింపునకై దైవాన్ని వేడుకోవటం!! అతనిపై కరుణించమని, అతని యెడల ఉదారంగా వ్యవహరించమని ప్రార్థించటం!!! ఈ విధంగా గనక చేస్తే అటు మృతునికి మేలు చేసినట్లవుతుంది, ఇటు తన స్వయానికి కూడా మేలు చేకూర్చుకున్నట్లవుతుంది. కాని ఈ ముష్రికులు వ్యవహారాన్నంతటినీ తలక్రిందులు చేసేశారు. ధర్మాన్ని తలక్రిందులు చేసివేశారు. వీళ్ళ సమాధి సందర్శన ఉద్దేశం మృతుణ్ణి దైవానికి భాగస్వామిగా నిలబెట్టడమై ఉంటుంది. మృతుని ముందు వేడుకోవటం, మృతుని ద్వారా దైవాన్ని వేడుకోవటం, మృతుని వాస్తాతో శుభాలు కురిపించమని ప్రార్థించటం, శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడమని మృతుల ద్వారా విజ్ఞాపన చేసుకోవటం అయి ఉంటుంది. ఈ విధంగా వారు తమ ఆత్మకు అన్యాయం చేసుకోవటమే గాక, మృతునికి కూడా హాని కలిగించేందుకు ప్రయత్నించారు. ఇలా చేయటం వల్ల వారికి అసలుకే నష్టం కలుగుతుంది. మృతుని మన్నింపుకోసం, కారుణ్యం కోసం దుఆ చేయమని అల్లాహ్  సూచించాడు. ఈ సూచనను ఉల్లంఘించినందువల్ల కలగవలసిన శుభం కూడా కలగకుండా పోతుంది. (ఇఘ్ ఆసతుల్ లహ్ ఫాన్ : 1/414, 415, 417)

దీనిద్వారా స్పష్టమయ్యేదేమిటంటే దర్గాల వద్ద మొక్కుకోవటం, మొక్కుబడులు సమర్పించుకోవటం షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్). ఎందుకంటే ఇది సమాధుల విషయంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఆజ్ఞకు పూర్తిగా విరుద్ధం. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశానుసారం సమాధుల వద్ద కట్టడం గానీ, మస్జిద్ గానీ నిర్మించకూడు. నిర్మాణాలు గనక జరిగితే, అజ్ఞానులు దానికి పవిత్రతను ఆపాదించే అవకాశముంటుంది. సమాధులలో ఉన్న మృతులకు, లాభనష్టాలు చేకూర్చే శక్తి ఉందని వారు ఊహిస్తారు. అక్కరలు తీరుస్తారని నమ్ముతారు. అందుకే వారు సమాధులను అలంకరించటం, దుప్పట్లను కప్పటం, మొక్కుబడులు సమర్పించటం మొదలెడతారు. ఆ విధంగానే ఆ సమాధులు విగ్రహారాధనా కేంద్రాలైనాయి. జనులు నిజదైవాన్ని వదలి విగ్రహపూజ చేయసాగారు. నిజానికి అంతిమ దైవప్రవక్త ఈ విషయమై ఎంతో ఆర్ద్రంగా  ఇలా వేడుకున్నారు : –

grave-worship-8

“అల్లాహ్! నా సమాధిని ప్రజలు పూజించే విగ్రహంగా మార్చకు.”
(మాలిక్-376, అహ్మద్-7054)

ముస్లిం సముదాయంలో సమాధుల పట్ల ఈ విధమైన వ్యవహారం జరగనున్నదని పసిగట్టి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రార్థించారు. అనేక ముస్లిం దేశాలలో ఈ పరిస్థితి ఎదురయింది కూడా. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రార్థనా శుభం వల్ల అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిని ఇలాంటి అపచారాల నుండి సురక్షితంగా ఉంచాడు. కొంతమంది అజ్ఞానులు, అవివేకులు ఇప్పటికీ ఆయన మస్జిద్ (మస్జిదె నబవీ)లో ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటారు. కాని వారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సమాధి వరకూ చేరుకోలేరు. ఎందుకంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి మస్జిద్ లో లేదు, అది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వగృహంలో ఉంది. దానికి నలువైపులా ఎత్తయిన గోడలు నిర్మితమై ఉన్నాయి. ఆ విషయమే అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఒక పద్యంలో ఇలా చెప్పారు :

grave-worship-9

“లోకేశ్వరుడు మీ మొరను ఆలకించాడు.
దానిని (మీ సమాధిని) మూడు గోడలతో దిగ్బంధం చేశాడు.”


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 128 – 132)

%d bloggers like this: