ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కావచ్చు

తల్హా బిన్ ఉబైదుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: 

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు. తదుపరి అందులో ఒక వ్యక్తి ఎక్కువగా ఆరాధనలు చేసేవాడు, అల్లాహ్  మార్గంలో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఇక రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు, మొదటి వ్యక్తి మరణించిన 1 సం॥ తర్వాత మరణించాడు. 

తల్హా (రదియల్లాహు అన్హు) కథనం:  ఈ రెండవ వ్యక్తి, వీరమరణం పొందిన మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించడం నేను కలలో చూశాను. మరుసటి రోజు ఉదయం ఈ కలను నేను ప్రజల ముందు ప్రస్తావించగా వీరు దీనిపై ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: “ఆ రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి మరణించాక 1 సం॥ పాటు బ్రతికి లేడా? దానిలో అతను రమజాన్ మాసాన్ని పొందాడు, దాని ఉపవాసాలు పాటించాడు మరియు 1 సం॥ పాటు నమాజులు (అదనంగా) చదివాడు. అందుకే వీరిద్దరి మధ్య (స్వర్గంలో) దూరం- భూమ్యాకాశాల మధ్య వున్న దూరమంత వుంది”. (సహీ ఉల్ జామె అస్సగీర్ లిల్ అల్బానీ : 1316) 

ఈ హదీసుపై కాస్త దృష్టి సారించండి! 

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. అందులో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కన్నా ఎక్కువగా ఆరాధించేవాడు మరియు వీరమరణం పొందాడు. ఇక రెండవ వ్యక్తి – మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు మరియు సహజ మరణం పొందాడు. మరి ఇతను మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలోకి ఎలా ప్రవేశిచగలిగాడు? దానికి కారణం ఏమిటంటే – ఇతను మొదటి వ్యక్తి వీరమరణం పొందాక 1 సం॥ పాటు బ్రతికి వున్నాడు. ఈ వ్యవధిలో ఇతనికి రమజాన్ మాసం ప్రాప్తించింది. అందులో ఇతను ఉపవాసాలు వున్నాడు మరియు సం॥ అంతా నమాజులు చదివాడు. ఇలా, ఉపవాసాలు మరియు నమాజుల కారణంగా వీర మరణం పొందిన వాని కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించాడు…. దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే శుభప్రద రమజాన్ మాసాన్ని పొంది, దానిలో ఉపవాసాలు పాటించడం అనేది అల్లాహ్ ఇచ్చే గొప్పవరం. 

మీరు ఓ విషయం ఆలోచించండి! మన స్నేహితులలో, బంధువులలో ఎంతో మంది గత రమజాన్ మాసంలో మనతో కలిసివున్నారు. కానీ ఈ రమజాన్ మాసం రావడానికి ముందే వారు లోకం విడిచి వెళ్ళిపోయారు. వారికి ఈ శుభప్రదమాసం ప్రాప్తం కాలేదు. కానీ మనకు అల్లాహ్ – జీవితాన్ని మరియు ఆరోగ్యాన్నిచ్చి దానితోపాటు శుభప్రదమైన ఈ మాసాన్ని కూడా ప్రసాదించాడు. తద్వారా మనం చిత్త శుద్ధితో మన పాపాలకు గాను పశ్చాత్తాపం చెంది మన సృష్టికర్త, యజమాని అయిన అల్లాహ్ ను  సంతృప్తి పరచుకోవచ్చు…. మరి ఇది అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్పవరం కాదా? 

అలాగే – ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కూడా కావచ్చు. మరుసటి రమజాన్ వచ్చే వరకు మనం కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు! అందుకే (అల్లాహ్ ప్రసాదించిన) ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరుచుకొని దాని శుభాలను ప్రోగు చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుండాలి. 

ఈ పోస్ట్ క్రింది ఖుత్బా నుండి తీసుకోబడింది:
శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం | జాదుల్ ఖతీబ్

%d bloggers like this: