
తౌహీదె అస్మావ సిఫాత్ (దైవ నామాలు, దైవగుణాలలో ఏకత్వం)
ఈ విషయం క్రింది అంశాలతో కూడుకుని ఉంది.
- మొదటిది: దైవ నామాలు, గుణగణాలకు సంబంధించి ఖుర్‌ఆన్, హదీసుల వెలుగులో ఆధారాలు, బుద్ధి పరమైన నిదర్శనాలు.
- రెండవది: అల్లాహ్ పేర్లు గుణగణాల గురించి అహ్లే సున్నత్ వల్ జమాఅత్ విధానం.
- మూడవది: అల్లాహ్ నామాలను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం.
మొదటిది: దైవనామాలు, గుణాల గురించి ఖుర్‌ఆన్, హదీసుల ఆధారాలు, బుద్ధిపరమైన ఆధారాలు.
(అ) ఖుర్‌ఆన్ హదీసుల ఆధారాలు :
ఇంతకుముందు మేము తౌహీదె ఉలూహియత్, తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్ అనే మూడు రకాలను గురించి ప్రస్తావించి ఉన్నాము. వాటిలో మొదటి రెండింటి ఆధారాలను, నిదర్శనాలను గురించి కూడా చర్చించాము. ఇప్పుడు తౌహీద్ మూడవ రకమయిన ‘అస్మా వ సిఫాత్’ (దైవనామాలు, గుణగణాల)ను రూఢీచేసే ఆధారాలను తెలుసుకుందాము.
(1) దివ్య ఖుర్‌ఆన్ ద్వారా కొన్ని ఆధారాలు
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ
“అల్లాహ్‌కు మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆయన్ని ఆ పేర్లతోనే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.” (అల్ ఆరాఫ్ 7:180)
ఈ సూక్తి ద్వారా అల్లాహ్ తనకు కొన్ని పేర్లున్నాయని, అవి అత్యుత్తమమయిన పేర్లని తెలియజేస్తున్నాడు. ఆ పేర్లతోనే తనను పిలవమని కూడా ఆదేశించాడు. ఉదాహరణకు : ఓ రహ్మాన్ (ఓ దయాకరా!), ఓ రహీమ్ (ఓ కృపాశీలుడా!), ఓ హై (ఓ సజీవుడా!), ఓ ఖయ్యూమ్ (ఓ ఆధారభూతుడా!), ఓ రబ్బిల్ ఆలమీన్ (ఓ లోకేశ్వరుడా!) మొదలగునవి. తన నామాల విషయంలో వక్రవైఖరి అవలంబించే వారిని, నిరాకరించేవారి గురించి హెచ్చరించాడు. ఎందుకంటే వారు అల్లాహ్ పేర్ల విషయంలో సత్యం నుండి తొలగిపోతారు లేదా అల్లాహ్‌కు గల పేర్లను పూర్తిగా నిరాకరిస్తారు. లేదా వాటి అర్ధాలను వక్రీకరిస్తారు లేదా నాస్తికతకు సంబంధించిన మరేదైనా దారి తెరుస్తారు. అలాంటి వారికి, తమ స్వయంకృతానికి తగిన శిక్ష లభిస్తుందని కూడా అల్లాహ్ హెచ్చరించాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ
“ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే.” (తాహా 20:8)
هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
“ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటికి, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, ఆయనే అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికి అతీతుడు, శాంతిప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు (ఆయనకు) కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లాహ్ – సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లన్నీ ఆయనకే ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు.” (అల్ హషర్ 59 : 22 – 24)
(2) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తుల వెలుగులో దైవ నామాలకు సంబంధించిన ఆధారాలు :
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :
“అల్లాహ్‌కు 99 పేర్లున్నాయి – ఒకటి తక్కువ వంద పేర్లు. ఇవి ఎటువంటి నామాలంటే, వాటిని (జ్ఞానపరంగానూ, క్రియాత్మకం గానూ) గ్రహించినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.”(ముత్తఫఖున్ అలై)
అల్లాహ్ యొక్క అత్యుత్తమ నామాలు కేవలం ఈ సంఖ్య (99)కే పరిమితం కావు. దీనికి ఆధారం హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌ఊద్ (రది అల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం:
మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వేడుకున్నారు:
“(ఓ అల్లాహ్!) నేను నీకు గల ప్రతి నామం ఆధారంగా నిన్ను అర్థిస్తున్నాను – దేని ద్వారానయితే నిన్ను నీవు పిలుచుకున్నావో! లేదా నీ గ్రంథంలో అవతరింపజేశావో! లేదా నీ సృష్టితాలలో ఎవరికయినా నేర్పావో! లేదా దానిని నీ వద్దనే – అగోచర జ్ఞానంలో భద్రపరచి ఉంచావో! అలాంటి ప్రతి నామం ఆధారంగా నిన్ను వేడుకుంటున్నాను (ప్రభూ!) మహత్తరమైన ఖుర్‌ఆన్‌ను నా హృదయ వసంతం గావించు!”
(ఈ హదీసును ఇమాం అహ్మద్ తన ముస్నద్ – 3528 లో పొందుపరిచారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశాడు. అల్లాహ్ పేర్లు కేవలం 99 కే పరిమితమై లేవని ఈ హదీసు నిరూపిస్తోంది. కనుక ఈ హదీసు ద్వారా విదితమయ్యేదేమిటంటే – నిజము దేవుడెరుగు – ఈ 99 పేర్లను నేర్చుకున్నవాడు, వాటి ఆధారంగా అర్థించినవాడు, వాటి ఆధారంగా దైవారాధన చేసినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ విశిష్టత ఈ పేర్లకే స్వంతం – సహీహుల్ జామి – 2622)
అల్లాహ్ యొక్క ప్రతి నామం ఆయన గుణగణాలలోని ఒకానొక గుణాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు : ‘అలీమ్‘ అనే నామం ఆయనలోని ఇల్మ్ (జ్ఞానం) గుణానికి నిదర్శనంగా ఉంది. అలాగే ‘హకీమ్‘ అనే పేరు ఆయనలోని హిక్మత్ (యుక్తి, వివేకం)ను సూచిస్తోంది. ‘సమీ” అనే పేరు ఆయన ‘సమ్‌అ’ (వినే) గుణానికి తార్కాణంగా ఉంది. ‘బసీర్‘ అనే ఆయన నామం ఆయనలోని ‘బసర్’ (చూసే, గమనించే) గుణానికి నిదర్శనంగా ఉంది. ఇదేవిధంగా ప్రతి పేరు అల్లాహ్ గుణ విశేషాలలో ఏదో ఒక గుణానికి ఆధారంగా ఉన్నది.
అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్ (నిజ ఆరాధ్యుడు) ఒకే ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (సరితూగేవాడు, పోల్చదగినవాడు) ఎవడూ లేడు.” (అల్ ఇఖ్లాస్ : 1 – 4)
హజ్రత్ అనస్ (రది అల్లాహు అన్హు) కథనం : ఒక అన్సారీ వ్యక్తి మస్జిదె ఖుబాలో వారికి ఇమామత్ చేసేవాడు (వారి సామూహిక నమాజుకు సారథ్యం వహించేవాడు). అతనెప్పుడు నమాజ్ చేయించినా (ఫాతిహా సూరా అనంతరం) ‘ఖుల్‌హు వల్లాహు అహద్” సూరా పారాయణం మొదలెట్టేవాడు. ఆ తరువాత ఏదైనా మరో సూరా పఠించేవాడు. అతను ప్రతి రకాత్‌లో అలాగే చేసేవాడు. సహాబా (సహచరు)లలో ఇది చర్చనీయాంశం అయింది. వారంతా కలసి అతనితో మాట్లాడారు. “నీవు ఇదే సూరాతో ఖిరాత్ మొదలెడుతున్నావు. పోనీ దీంతో సరిపెట్టుకుంటావా అంటే అదీ లేదాయె. దీంతో పాటు మరో సూరా కూడా పఠిస్తున్నావు. నీవు పఠిస్తే ఈ ఒక్క సూరాయే పఠించు. లేదంటే దీనిని వదిలేసి వేరే సూరా ఏదన్నా పఠించు” అని అతన్ని కోరారు. దానికతను ఇలా జవాబిచ్చాడు : “నేను ఈ సూరాను వదలనుగాక వదలను. మీకిష్టముంటే నేనిలాగే ఇమామత్ చేస్తాను. ఇలా చేయటం ఇష్టం లేదనుకుంటే చెప్పండి, మీ సారథ్య బాధ్యతలు వదలుకుంటాను.” కాని వారంతా ఆ వ్యక్తిని తామందరిలోకెల్లా ఉత్తమునిగా పరిగణించేవారు. కనుక అతను తప్ప వేరొక వ్యక్తి తమకు ఇమామత్ చేయటం వారికిష్టం లేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ వద్దకు ఏతెంచినపుడు, పరిస్థితుల స్వరూపాన్ని క్షుణ్ణంగా వివరించారు. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తినుద్దేశించి,
“ఓ ఫలానా వ్యక్తీ! నీ సహచరులు అడుగుతున్నట్లుగా మసలుకోవటంలో నీకు వచ్చిన చిక్కేమిటీ? అంటే ప్రతి రకాతులో ఇదే సూరా పఠించటానికి నిన్ను ప్రేరేపిస్తున్నదేది?” అని ప్రశ్నించారు.
దానికా వ్యక్తి, “నేనీ సూరాను ప్రగాఢంగా ఇష్టపడుతున్నాను” అన్నాడు.
“ఈ సూరాపట్ల నీకు గల ప్రేమ నిన్ను స్వర్గానికి చేరుస్తుంది” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (సహీహ్ బుఖారీ)
హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా) కథనం ఇలా ఉంది : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని ఓ చిన్న సైనిక బృందానికి అమీర్ (నాయకుని)గా నియమించి పంపారు. ఆ వ్యక్తి తన బృందానికి నమాజ్ చేయించేవాడు. ఈ సందర్భంగా ఖిరాత్ చివర్లో ఎలాగయినాసరే “ఖుల్‌హు వల్లాహు అహద్” సూరా చదివేవాడు. ఆ బృందంలోని సభ్యులు తిరిగి వచ్చాక, ఈ సంగతిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించగా,
“అతనలా ఎందుకు చేసేవాడో అతన్నే అడగండి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.
జనులు ఈ విషయమై అతన్ని దర్యాప్తు చేయగా అతనిలా అన్నాడు : “ఈ సూరా పారాయణం అంటే నాకెంతో ఇష్టం.” ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :
“అల్లాహ్ అతన్ని ఇష్టపడుతున్నాడని అతనికి తెలియజేయండి.” (సహీహ్ బుఖారీ).
అంటే: ఈ సూరా కరుణామయుడైన అల్లాహ్ గుణగణాలతో కూడుకుని ఉంది.
తనకు ముఖం కూడా ఉందని అల్లాహ్ తెలియజేశాడు. దీనికి నిదర్శనం ఈ ఆయత్ :
وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
“ఎప్పటికీ మిగిలి ఉండేది వైభవోపేతుడైన, గౌరవనీయుడైన నీ ప్రభువు ముఖారవిందమే.” (అర్ రహ్మాన్ 55: 27)
అలాగే – అల్లాహ్‌కు రెండు చేతులున్నాయి :
خَلَقْتُ بِيَدَيَّ
“నేనతన్ని (ఆదమును) నా రెండు చేతులతో సృష్టించాను.” (సాద్ 38 : 75)
بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ
“వాస్తవానికి అల్లాహ్ చేతులు రెండూ తెరచుకుని ఉన్నాయి.” (అల్ మాయిద 5: 64)
ఇంకా – అల్లాహ్ సంతోషిస్తాడు, ప్రేమిస్తాడు, కినుక వహిస్తాడు, ఆగ్రహిస్తాడు – ఇవన్నీ ఆయన లక్షణాలే. ఇవిగాక మరెన్నో లక్షణాలున్నాయి. వాటిని గురించి ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల ద్వారా కూడా ఆయన లక్షణాలు తెలుస్తున్నాయి –
(ఆ) అల్లాహ్ నామాలను, లక్షణాలను నిరూపించే బుద్ధిపరమయిన ఆధారాలు
అల్లాహ్ నామాలు, గుణగణాలకు సంబంధించి షరీయత్ పరమయిన ఆధారాలున్నట్లే బుద్ధిపరమయిన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి :
1. రకరకాల సృష్టితాలు అసంఖ్యాకంగా ఉనికిలోనికి రావటం. తమ సృష్టికి వెనుక ఉన్న పరమార్థాలను నెరవేర్చటంలో అవి పకడ్బందీగా పనిచేయటం, తమ కొరకు నిర్ధారించబడిన కక్ష్యలో – పరిధిలో – ఉండి మరీ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం, ఇవన్నీ అల్లాహ్ ఘనత్వానికి, శక్తికి, యుక్తికి, జ్ఞానానికి, ఆయన ఇచ్చకు నిలువుటద్దంగా ఉన్నాయి.
2. అనుగ్రహించటం, మేలు చేయటం, కష్టాలను, ఆపదలను తొలగించటం – ఇవన్నీ దైవకారుణ్యానికి, ఉదాత్త గుణానికి నిదర్శనంగా ఉన్నాయి.
3. అవిధేయులను శిక్షించటం, ధిక్కారులపై ప్రతీకారం తీర్చుకోవటం – ఇది దైవాగ్రహ గుణానికి తార్కాణం.
4. విధేయులను, విశ్వాసపాత్రులను సత్కరించటం, కటాక్షించటం, వారికి పుణ్యఫలం ప్రసాదించటం – ఇవి రెండూ దైవ ప్రసన్నతకు, ప్రేమైక గుణానికి దర్పణంగా ఉన్నాయి.
రెండవది : దైవనామాలు, దైవగుణాల విషయంలో అహ్లే సున్నత్ వల్ జమాఅత్ విధానం :
అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు, సలఫె సాలెహ్ కోవకు చెందినవారు, వారి అనుయాయులు – అల్లాహ్ నామాలు, గుణగణాల విషయంలో వీరందరి విధానం ఒక్కటే. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్‌లో తెలుపబడినట్లుగా వారు వాటిని యధాతథంగా విశ్వసిస్తారు. వారి పద్ధతి క్రింది నిబంధనలను అనుసరించి ఉంటుంది.
(1) వీరు దైవనామాలను, గుణగణాలను దైవగ్రంథానుసారం, ప్రవక్త విధానానుసారం నమ్ముతారు. తదనుగుణంగానే వాటిని రూఢీ చేస్తారు. వాటి బాహ్య స్వరూపానికి విరుద్ధంగా అర్థాలు తీయరు. వాటిని మార్చే ప్రయత్నం కూడా చేయరు.
(2) ఆయన నామాలను, లక్షణాలను సృష్టితాల లక్షణాలతో పోల్చి చెప్పటాన్ని వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు : అల్లాహ్ సెలవిచ్చినట్లు:
لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.” (అష్ షూరా 42 : 11)
(3) దైవనామాలను, దైవిక గుణాలను రుజువు చేయటానికి ఏ ఏ ఆధారాలు, నిదర్శనాలు ఖుర్‌ఆన్, హదీసులలో ఇవ్వబడ్డాయో, వాటిని సుతరామూ ఉల్లంఘించరు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ ఆధారాలను, రుజువులను చూపారో, వాటిని ఖచ్చితంగా అంగీకరిస్తారు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోసిపుచ్చిన వాటిని వీరు కూడా త్రోసిరాజంటారు. ఏ విషయాలపై అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనం వహించారో వాటిపై వీరు కూడా మౌనం వహిస్తారు.
(4) దైవనామాలు, గుణగణాలకు సంబంధించిన దైవసూక్తులను వీరు తిరుగులేనివిగా, స్పష్టమైనవి (ముహ్కమాత్)గా విశ్వసిస్తారు. వాటి భావార్థాన్ని గ్రహించవచ్చునని, వాటిని గురించి కూలంకషంగా విడమరచి చెప్పటం సాధ్యమేనని భావిస్తారు. ఈ ఆయతులను వారు అస్పష్టమైనవిగా, నిగూఢమైనవి (ముతషాబిహాత్) గా పరిగణించరు. అందుకే వారు – అభినవ రచయితలు కొంతమంది లాగా తప్పుడు ప్రకటనలు ఇవ్వటంగానీ, విషయాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేయటం గానీ చేయరు. మొత్తానికి వీరి వ్యవహారం ఈ విషయంలో నిర్దిష్టంగా, నిర్ధ్వంధ్వంగా, సూటిగా ఉంటుంది.
(5) గుణగణాల వైనం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న జనించినపుడు ఆ జ్ఞానం అల్లాహ్ కే ఉందని చెబుతారు. ఈ విషయంలో వితండ వాదనకు దిగరు. అనవసరంగా విషయాన్ని సాగదీయరు.
మూడవది : మొత్తం పేర్లను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం:
దైవ నామాలను, గుణగణాలను నిరాకరించే వారిలో మూడు రకాల వారున్నారు.
1. జహ్‌మియా వర్గం: వీరు జహమ్ బిన్ సఫ్వాన్ అనుయాయులు. వీళ్లు అల్లాహ్ పేర్లన్నింటినీ, గుణగణాలన్నింటినీ నిరాకరిస్తారు.
2. మోతజిలా వర్గం: వీళ్లు వాసిల్ బిన్ అతా అనుయాయులు. వాసిల్ ఇమామ్ హసన్ బస్రీ సమావేశాల నుండి వేరైపోయారు. వీరు కేవలం అల్లాహ్ నామాలను మాత్రమే రూఢీ చేస్తారు. అయితే ఆ నామాలు కేవలం పదాలేనని, వాటికి అర్ధం అనేది ఏమీ లేదని వాదిస్తారు. ఇక అల్లాహ్ గుణగణాల విషయానికివస్తే, ఆసాంతం వాటీని నిరాకరిస్తారు.
3. అషాఅరా [1] , మాతరీదీయ [2] వర్గీయులు – వారి అనుయాయులు: వీరు దైవనామాలు, గుణగణాలలో కొన్నింటిని అంగీకరిస్తారు. కొన్ని గుణాలను మాత్రం నిరాకరిస్తారు.
[1] వీరు అబుల్ హసన్ అష్అరీ అభిమతాన్ని అనునరించేవారు . అయితే అబుల్ హసన్ తరువాతి కాలంలో తన విధానానికి స్వస్తి పలికి అహఁలే సున్నత్ అభిమతాన్ని అవలంబించాడు. కాని అతని అనుయాయులు మరలి రాలేదు. కాబట్టి వీళ్లను అబుల్ హసన్ అష్అరీ వర్గీయులని అనటం నరికాదు.
[2] వీరు అబూ మన్సూర్ మాతురీదీ అనుయాయులు.
వీరి అభిమతానికి పునాది ఇది :
అల్లాహ్‌ను ఆయన సృష్టితాలతో పోల్చే చేష్ట నుండి తాము సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణులలో కొందరున్నారు. వారు తమను అల్లాహ్ నామాలతో పిలుచుకుంటున్నారు. అల్లాహ్ గుణాలలో కొన్ని గుణాలను తమ కొరకు ప్రత్యేకించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దీనివల్ల పేర్లు, గుణగణాల విషయంలో సృష్టికర్త – సృష్టితాలు కలగాపులగం అవుతున్నాయి. తత్కారణంగా ఆ రెండింటి వాస్తవికతలో కూడా “భాగస్వామ్యానికి” తావు ఏర్పడుతున్నది. ఆ విధంగా సృష్టితాలను కూడా సృష్టికర్తతో పోల్చేందుకు ఆస్కారం కలుగుతోంది – ఇదీ వారి వాదన. అందువల్ల వారు క్రింద పేర్కొనబడిన రెండు విషయాలలో ఏదో ఒకదానిని మాత్రమే అవలంబిస్తారు.
(అ) వారు అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణాలకు సంబంధించిన ‘మూలాల’ను వాటి బాహ్యార్థాల ద్వారా గ్రహిస్తారు. ఉదాహరణకు : (అల్లాహ్) ‘ముఖము’ను ‘అల్లాహ్ అస్తిత్వం’ అనే అర్థంలో తీసుకుంటారు. (అల్లాహ్) ‘చేతులు’ను ‘అల్లాహ్ అనుగ్రహం’ అన్న భావంలో తీసుకుంటారు.
(ఆ) లేదా ఈ ‘మూలాల’ భావార్ధాన్ని అల్లాహ్‌కే వదలివేస్తారు. అదేమంటే, వాటి అర్ధం అల్లాహ్ కే తెలుసు అంటారు. ఈ నామాలు మరియు గుణాలు వాటి బాహ్యార్ధంలో లేవని కూడా నమ్ముతారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“(ఓ ముహమ్మద్!) ఇదేవిధంగా మేము నిన్ను ఈ సమాజం లోకి పంపాము – ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి – మా తరఫున నీపై అవతరించిన వాణిని వారికి వినిపించటానికి! వారు కరుణామయుని (అల్లాహ్‌ను) తిరస్కరిస్తున్నారు.” (అర్ రాద్ 13:20)
ఈ సూక్తి అవతరణ వెనుక గల నేపథ్యం ఇది :
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కరుణామయుని (రహ్మాన్) ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు, వారు దానిని స్పష్టంగా త్రోసిపుచ్చారు. అప్పుడు అల్లాహ్ వారి గురించి “వారు కరుణామయుని (అల్లాహ్‌ను) తిరస్కరిస్తున్నారు” అనే ఆయతును అవతరింపజేశాడు.
ఇది హుదైబియా ఒడంబడిక సందర్భంగా ఎదురైన సంఘటన అని అల్లామా ఇబ్నె జరీర్ అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అరబ్బు ముష్రికులకు మధ్య జరిగిన ఒడంబడికను లిఖించటానికి పూనుకున్నప్పుడు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్” అని వ్రాయించారు. దానికి ఖురైషులు అభ్యంతరం తెలుపుతూ “రహ్మాన్ ఎవరో మాకు తెలీదు” అన్నారు.
ఇబ్నె జరీర్ గారు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని ఈ సందర్భంగా ఉదాహరించారు. దీని ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా స్థితిలో దుఆ చేస్తూ “యా రహ్మాన్! యా రహీమ్!” అనేవారు. అది విన్న ముష్రిక్కులు, ‘ఈయన గారు ఒక ఆరాధ్య దైవాన్ని మొర పెట్టుకుంటున్నట్టు భావిస్తున్నాడు. కాని ఆయన మొరపెట్టుకునేది ఇద్దరు ఆరాధ్యులను’ అని ఎద్దేవా చేశారు. అప్పుడు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు.
قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ
వారికి చెప్పు : “అల్లాహ్‌ను అల్లాహ్ అని పిలిచినా, రహ్మాన్ అని పిలిచినా – ఏ పేరుతో పిలిచినా-మంచి పేర్లన్నీ ఆయనవే.” (అల్ ఇస్రా 17 : 110)
అల్ ఫుర్ఖాన్ సూరాలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు :
وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَٰنِ قَالُوا وَمَا الرَّحْمَٰنُ
“కరుణామయునికి సాష్టాంగపడండి” అని వారితో అన్నప్పుడు, “కరుణామయుడంటే ఏమిటి? (ఇంతకీ ఆయనెవరు?) అని వారంటారు. (అల్ ఫుర్ఖాన్ 25 : 60)
కనుక అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను – ఏ విధంగానయినా నిరాకరించే ఈ ముష్రిక్కులు, జహ్‌మియా వర్గీయులు, మోతజిలా వర్గీయులు, అషాఅరా అనుంగు అనుచరులు, ఇంకా ఈ ధోరణిని అనుసరించే వారి పూర్వీకులు – వీరంతా నిరసించదగిన వారు.
దైవనామాలను, గుణగణాలను నిరాకరించేవారి ధోరణి క్రింది పద్ధతుల ద్వారా ఖండించబడుతుంది –
మొదటి పద్ధతి :
మొదటి పద్ధతి ఏమిటంటే అల్లాహ్ తన కొరకు నామాలను, గుణాలను రూఢీ చేశాడు. ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఆయనకు పేర్లు, గుణాలున్నాయని రుజువు చేశాడు. కనుక అల్లాహ్ నామాలను, గుణాలను పూర్తిగాగానీ, పాక్షికంగా గానీ నిరాకరించటమంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరూపించిన వాటిని ఏకంగా త్రోసిపుచ్చటమే అవుతుంది. ఆ విధంగా ఇది అల్లాహ్ తోనూ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోనూ వ్యతిరేకతను, శత్రుత్వాన్ని కొనితెచ్చుకునే చేష్టే.
రెండవ పద్ధతి:
రెండవ పద్ధతి ఏమిటంటే; మనుషులలో అల్లాహ్ లోని సుగుణాలు కానవచ్చినంత మాత్రాన లేదా మనుషులలో కొందరికి అల్లాహ్ పేర్లున్నంతమాత్రాన సృష్టికర్తకు – సృష్టితాలకు (అల్లాహ్ కు – మనుషులకు) మధ్య సామ్యం, పోలిక ఉండాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే అల్లాహ్ నామాలు, గుణ విశేషాలు అల్లాహ్ కే స్వంతం. అల్లాహ్ కే పరిమితం, ప్రత్యేకం. మనుషులకు గల పేర్లు, గుణాలు మనుషులకే పరిమితం. ఏ విధంగానయితే అల్లాహ్ అస్థిత్వం ఇతర సృష్టితాల అస్థిత్వంతో పోలిక కలిగిలేదో, అదేవిధంగా అల్లాహ్ నామాలు, గుణగణాలు కూడా సృష్టితాల పేర్లతో, గుణాలతో పోలిక కలిగి లేవు. అల్లాహ్ పేరు – మనుషుల పేరు ఒకటై ఉన్నంత మాత్రాన వారికి భాగస్వామ్యం ఉన్నట్లు లెక్క కాదు. ఉదాహరణకు : అల్లాహ్‌కు అలీమ్, హకీమ్ అనే పేర్లున్నాయి. అయితే ఆయన తన దాసుల్లో కొందరికి ‘అలీమ్’ అనే పేరు పెట్టాడు.
وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ
“వారు (దైవదూతలు) అతని (ఇబ్రాహీమ్)కి జ్ఞాన సంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు.” (అజ్ జారియాత్ 51 : 28)
ఇక్కడ ‘అలీమ్’ అంటే ఇస్‌హాఖ్ (రది అల్లాహు అన్హు) అన్నమాట. మరొక దాసునికి ‘హలీమ్’ అనే నామకరణం చేశాడు :
فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
“అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్త వినిపించాము” (అస్ సాఫ్ఫాత్ 37 : 101)
ఇక్కడ ‘హలీమ్” అంటే ఇస్మాయీల్ (రది అల్లాహు అన్హు) అని భావం. అయితే ఈ ‘అలీమ్” గానీ, ‘హలీమ్’గానీ అల్లాహ్‌కు గల పేర్ల (అలీమ్, హలీమ్) వంటివి కావు.
అలాగే అల్లాహ్ తనకు సమీ, బసీర్ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నాడు:
إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا
“నిశ్చయంగా అల్లాహ్ అంతా వింటున్నాడు, అంతా చూస్తున్నాడు.” (అన్ నిసా 4 : 58)
అయితే ఆయన తన దాసుల్లో కూడా కొందరిని సమీగా, బసీర్‌గా అభివర్ణించాడు.
ఉదాహరణకు ఒకచోట మనిషిని గురించి ఇలా సెలవిచ్చాడు :
إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا
“నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ బిందువుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.” (అల్ ఇన్సాన్ 76 : 2)
అయితే ఒక వినేవాడు (సమీ) మరో వినేవాని (సమీ) వంటివాడు కాడు. ఒక చూసేవాడు (బసీర్) మరో చూసేవాని (బసీర్) వంటివాడు కాడు.
ఇంకా చెప్పాలంటే అల్లాహ్ తనకు రవూఫ్, రహీమ్ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఉదాహరణకు : ఆయన ఒకచోట ఇలా సెలవిచ్చాడు.
إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ
“నిశ్చయంగా అల్లాహ్ మనుషుల యెడల మృదుత్వం గలవాడు, జాలిచూపేవాడు.” (అల్ హజ్జ్ 22 : 65)
అయితే అల్లాహ్ తన దానుల్లో కూడా కొందరిని రవూఫ్‌గా, రహీమ్‌గా వ్యవహరించాడు. ఉదాహరణకు : ఒక చోట ఇలా సెలవిచ్చాడు :
لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ
“మీ దగ్గరకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను మృదు స్వభావి (రవూఫ్), దయాశీలి (రహీమ్).” (అత్ తౌబా 9 : 128)
అయితే ఒక “రవూఫ్” మరో “రవూఫ్” వంటివాడు కాడు. ఒక “రహీమ్” మరో “రహీమ్” వంటివాడు కాడు.
అలాగే అల్లాహ్ తనకు ఎన్నో గుణ విశేషాలున్నాయని చెప్పుకున్నాడు. దాంతో తన దాసులలో కూడా అలాంటి గుణగణాలున్నాయని పేర్కొన్నాడు. ఉదాహరణకు : ఒకచోట ఈ విధంగా సెలవీయబడింది :
وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ
“ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు” (అల్ బఖర 2 : 255)
ఈ సూక్తిలో ఆయన తనలోని జ్ఞాన విశేషాన్ని గురించి చెప్పుకున్నాడు. దాంతో పాటే తన దాసుల జ్ఞాన విశేషాన్ని గురించి కూడా ప్రస్తావించాడు. ఈ విధంగా సెలవిచ్చాడు:
وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا
“మీకు ఒసగబడిన జ్ఞానం బహు స్వల్పం.” (అల్ ఇస్రా 17 : 85)
మరోచోట ఇలా సెలవిచ్చాడు :
وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ
“ప్రతి జ్ఞానినీ మించిన జ్ఞాని ఒకడున్నాడు.” (యూసుఫ్ 12 : 76)
వేరొకచోట ఇలా అనబడింది:
.. وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ
“అప్పుడు (ధర్మ) జ్ఞానం వొసగబడినవారు వారికి ఇలా బోధపరచ సాగారు ….” (అల్ ఖసస్ : 80)
అలాగే అల్లాహ్ తనకు గల శక్తి గుణాన్ని గురించి చెప్పుకున్నాడు.
إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
“నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, సర్వాధిక్యుడు.” (అల్ హజ్జ్ 22:40)
ఈ విధంగా కూడా చెప్పుకున్నాడు :
إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
“అల్లాహ్‌యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.” (అజ్ జారియాత్ : 58)
దాంతోపాటే తన దాసుల శక్తిని గురించి ఆయన ఇలా విశ్లేషించాడు :
اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً
“అల్లాహ్ – ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. ఈ బలం తరువాత మళ్లీ మీకు బలహీనతను ఇచ్చాడు. (మిమ్మల్ని) వృద్ధాప్యానికి చేర్చాడు.” (అర్ రూమ్ 30 : 54)
దీనిద్వారా తెలిసిందేమిటంటే అల్లాహ్ నామాలు, గుణాలు ఆయనకే స్వంతం. ఆయనకే శోభాయమానం. మనుషుల పేర్లు గుణాలు వారికే ప్రత్యేకం, వారికే అవి తగినవి. పేర్లు, గుణాలు ఒకేవిధంగా కనిపించినంతమాత్రాన వాస్తవంలో అవి ఒకటి కావు. రెండింటి మధ్య ఎలాంటి సామ్యంగానీ, పోలికగానీ లేదు. ఇది చాలా స్పష్టమయిన విషయం. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం.
మూడవ పద్ధతి
ఎవరయితే గుణగణాల రీత్యా పరిపూర్ణుడు కాడో అతనికి ఆరాధ్య దేవుడయ్యే అర్హత లేదు. అందుకే దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం ( అలైహిస్సలాం) తన తండ్రితో ఇలా అన్నారు:
يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ
“(ఓ నాన్నా!) వినలేని, కనలేని వాటిని మీరు ఎందుకు పూజిస్తారు?” (మర్యమ్ : 42)
ఆవు దూడను పూజించే వారి చర్యను ఖండిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ
“అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదన్న సంగతిని గురించి వారు ఆలోచించలేదా?” (అల్ ఆరాఫ్ 7 : 148)
నాల్గవ పద్దతి:
గుణాలను రూఢీ చేయటం పరిపూర్ణతకు చిహ్నం. నిరాకరించటం లోపానికి ఆనవాలు. ఎందుకంటే గుణములు లేనివాడు నశించినవానితో సమానం లేదా లోపభూయిష్టతకు తార్కాణం. అల్లాహ్ ఈ రెండింటికీ అతీతుడు, పవిత్రుడు.
ఐదవ పద్ధతి:
దైవగుణాలకు మనం మనవైన భాష్యాలు చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. పైగా ఈ ధోరణి ఒక మిథ్య. వాటి అర్ధాలను అల్లాహ్ కే అప్పగించటం కూడా సరైనది కాదు. ఇలా చేస్తే, ఖుర్‌ఆన్‌లో మనకు ఏమీ తెలియని విషయాల గురించి అల్లాహ్ మనకు ఆజ్ఞలు జారీచేసినట్లవుతుంది. కాగా; తనను తన పేర్లతోనే పిలవమని అల్లాహ్ మనల్ని ఆదేశించాడు. మరి మనకు అర్థమే తెలియనపుడు ఎలా పిలిచేది? మరోవైపు అల్లాహ్ ఖుర్‌ఆన్‌లో అనేకచోట్ల ఆజ్ఞాపిస్తున్నాడు – ఖుర్‌ఆన్‌పై చింతన చేయమని! మనకు భావార్దాలే తెలియనపుడు వాటిపై మనం చింతన ఎలా చేయగలుగుతాము?
కనుక బోధపడేదేమిటంటే అల్లాహ్ యొక్క నామాలను, ఆయన గుణగణాలను మనుషులతో పోల్చకుండా యధాతథంగా అంగీకరించటం అనివార్యం. ఎందుకంటే ఆయన నామాలు, ఆయన గుణగణాలు ఆయన స్టాయికి, వైభవానికి తగినట్లుగానే ఉన్నాయి. ఉదాహరణకు : అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.” (అష్ షూరా 42 : 11)
ఈ ఆయతులో అల్లాహ్ తనను ఏ వస్తువుతోనయినా సరే పోల్చటాన్ని త్రోసిపుచ్చాడు. అలాగే తనలోని వినే, చూచే గుణాలను రుజువు చేశాడు. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే దైవగుణాలను అంగీకరించటం వల్ల వాటికి పోలికలను ఆపాదించినట్టు అర్థం కాదు. పోలికలను త్రోసిపుచ్చటంతో పాటు, గుణగణాలను అంగీకరించటం అవశ్యమని కూడా దీనిద్వారా అవగతమవుతోంది. అల్లాహ్ నామాల, గుణాల విషయంలో అహఁలే సున్నత్ వల్ జమాఅత్ చెప్పేదొక్కటే : “పోలికలతో నిమిత్తం లేకుండా వీటిని ఒప్పుకోవాలి. కాదు, కూడదు అని అనకుండా వాటిని స్వచ్చమైనవిగా ఖరారు చేయాలి.”
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (75 – 87పేజీలు)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
You must be logged in to post a comment.