

పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్న వారలారా! రంగు రంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!
అతి త్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుమ… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్గమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం.
ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.
ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యా పిల్లలు ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జా దారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.
ఈ ప్రమాదకర లోయలో భయంకర క్రూరమృగాల భయం ఉంటుంది.
మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!
అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!
శుభ వార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!
“నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” (తిర్మిజీ)
ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా!
మనోమస్తిష్కాలు కలవారలారా!
ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగు పెట్టబోతున్న వారలారా!
వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్, జకాత్, ఉపవాసాలు, హజ్, ఉమ్రా, ఖుర్ఆన్ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలు దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.
కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!
బయలుదేరేముందు మానవ మహోపకారి, దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి అందరికంటే పెద్ద సానుభూతిపరుడు అయిన కారుణ్య ప్రవక్త హితవును ఒకసారి శ్రద్ధగా వినండి…!
ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు:
“సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి” (ఇబ్నెమాజా),
మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…
ఆయన పిలుపుకు హాజరు పలికి…
ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!
వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్.
ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
“సమాధి సంగతులు” [పుస్తకం] పరిచయ వాక్యాలు
కూర్పు : మౌలానా ముహమ్మద్ ఇఖ్బాల్ కైలానీ
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్. హైద్రాబాద్, ఏ.పి. ఇండియా
దీన్ని పంచుకోండి, బారక్ అల్లాహ్ ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…