మర్యాదపూర్వక సంభాషణ & స్నేహపూర్వక కలయిక

طيب الكلام وطلاقة الوجه

عَنْ اَبِىْ ذَرٍّ قَالَ لِى النَّبِىُّ ^ لَا تَحْقِرَنَّ مِنَ الْـمَعْرُوْفِ شَيْـﺌـاً وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ (رواه مسلم)

తాత్పర్యం:- అన్ అబిదరిన్  రదియల్లాహు అన్హు ఖాల – ఖాలలిన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం “లా తహ్ ఖిరన్న మినల్ మఅరూఫి షైఅన్ – వలౌ అన్ తల్ ఖా అఖాక బి వజ్ హిన్ తల్ ఖ్”

అన్ = ఉల్లేఖన , అబిదరిన్ = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి),  రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక  ,  ఖాల = తెలిపారు, లీ = నాకు, అన్నబియ్యు = ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్),  లా తహ్ ఖిరన్న = చిన్నదిగా భావించవద్దు (అల్పమైనదిగా), మినల్ మాఁరూఫి= పుణ్యాలలో నుండి ,  షైఅన్ = ఏదైనా,  వలౌ = ఒకవేళ, అన్ తల్ ఖా = నీవు కలుసుకుంటే,  అఖాక = తోటి సోదరుడితో,  బి వజ్ హిన్ తల్ ఖ్ = ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కూడిన ముఖంతో.

అనువాదం:- అబిదర్  రదిఅల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(ఓ అబూదర్!) ఏ మంచిపనినైనా అల్పమైనదిగా భావించకు, ఒకవేళ అది నీ తోటి సోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో ఆహ్లాదకరంగా కలవడమైనా సరే,” సహీముస్లిం హదీథ్ గ్రంథం

వివరణ:- ఈ హదీథ్మనకు ఇస్లాం బోధించే మరియు చేయమని ప్రోత్సహించే మంచి పనులలో అవి ఎంత చిన్నవైనా  వాటిని ఎప్పుడూ అల్పమైనవిగా భావించరాదని తెలియజేస్తున్నది.ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుణ్ణి ఎప్పుడు కలిసినా, పలకరించినా మనస్పూర్తిగా, పూర్తి సంతోషంగా, నవ్వు ముఖంతో ఆహ్లాదకరంగా పలకరించాలి – ఇది చాలా అల్పమైన విషయంగా కనిపించినప్పటికీ. ఎందుకంటే రూపం ఎప్పుడూ అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. సంతోషంగా, చిరునవ్వుతో మన తోటి సోదరులను కలవడం, వారిలో కూడా సంతోషాన్ని, తన తోటి సోదరుల పట్ల – అల్లాహ్ కొరకు – ప్రేమాభిమానాలను, గౌరవాన్ని పెంపొందిస్తాయి. అంతేకాక ఇస్లాం నైతిక విలువలకు, సంస్కారానికి విలువనిచ్చే మతమని ఈ హదీథ్ తెలియజేస్తున్నది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు :-

 1. (షరిఅహ్ కు లోబడి) మంచిపని ఎంత చిన్నదైనాసరే అల్పమైనదిగా ఎప్పుడూ తలంచరాదు.
 2. తోటి వారితో ఎప్పుడూ ఆహ్లాదకరంగా, సంతోషంగా కలవాలి.
 3. తోటి ముస్లిం సోదరులతో సోదరభావాన్ని బలంగా నాటే, మరియు పెంపొందించే ఇలాంటి విషయాలను ఫ్రోత్సహించాలి.
 4. మన తోటి ముస్లిం సహోదరుని ముఖం సంతోషంతో వికసించేలా చేయడం, చిరునవ్వుతో వెలిగేలా చేయడం కూడా పుణ్యకార్యాలలో ఒకటి అని మర్చిపోరాదు.

హదీథ్  ఉల్లేఖించిన వారి పరిచయం׃ అబిదర్  రదియల్లాహు అన్హు ఇస్లాం ధర్మవిషయాల అమలులో ఎటువంటి రాజీ పడనివ్యక్తిగా ప్రసిద్ధిచెందారు. ప్రారంభకాలంలోనే ఇస్లాం స్వీకరించారు. మక్కా నుండి మదీనా వలస పోయినవారిలో ఒకరు.  హిజ్రీ 32వ సంవత్సరం, మూడవ ఖలీఫా ఉథ్మాన్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో మరణించారు.

ప్రశ్నలు

 1. “లా తహ్ ఖిరన్న మినల్ _____ షైఅన్ – వలౌ అన్ తల్ ఖా _____బి వజ్ హిన్ తల్ ఖ్”
 2. “(ఓ అబూదర్!) ఏ మంచిపనినైనా ______ భావించకు, ఒకవేళ అది నీ తోటి సోదరుణ్ణి __________ ముఖంతో ఆహ్లాదకరంగా కలవడమైనా సరే,”
 3. ఇస్లాం ప్రోత్సహించే మంచి పనులు ఎంత చిన్నవైనా  వాటిని ________ భావించరాదు
 4. ఒక ముస్లిం తన తోటి వారిని ఎప్పుడు కలిసినా, పలకరించినా మనస్పూర్తిగా, పూర్తి సంతోషంగా, చిరునవ్వు ముఖంతో పలుకరించాలి. _______  ( తప్పు  /  ఒప్పు)
 5. రూపం ఎప్పుడూ _______ ప్రతిబింబిస్తూ ఉంటుంది.
 6. సంతోషంగా మనతోటి సోదరులను కలవడం, వారిలో కూడా సంతోషాన్ని, తనతోటి వారిపట్ల – అల్లాహ్ కొరకు – ప్రేమాభిమానాలును, గౌరవాన్ని ___________.
 7. __________ నైతిక విలువలకు, సంస్కారానికి విలువనిచ్చే సత్యమైన ధర్మం.
 8. (షరిఅహ్ కులోబడి) ________ఎంత చిన్నదైనాసరే అల్పమైనదిగా ఎప్పుడూ తలంచరాదు.
 9. తోటి వారితో ఎప్పుడూ __________, __________ కలవాలి.
 10. తోటి ముస్లిం సోదరులతో సోదరభావాన్ని బలంగా నాటే, మరియు పెంపొందించే ఇలాంటి విషయాలను __________.
 11. మన తోటి ముస్లిం సహోదరుని ముఖం సంతోషంతో వికసించేలా చేయడం, చిరునవ్వుతో వెలిగేలా చేయడం కూడా __________ ఒకటి అని మర్చిపోరాదు.
 12. అబిదర్  రదియల్లాహు అన్హు గురించి వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity

الإخلاص في العمل చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity –

1 – عن  عمرَ بنَ الخَطّابِ t المِنْبَرِ قال: سَمعْتُ رَسولَ اللّهِ r يَقولُ «إِنّما الأعْمَالُ بالنّيات, وإِنّمَا لِكُلّ امْرِىءٍ ما نَوَى: فَمَنْ كانتْ هِجْرَتُه إِلى دُنْيَا يُصِيبُها, أَوْ إِلى امْرَأَةٍ يَنْكِحُها, فَهِجْرَتُه إِلى ما هاجَرَ إِلَيه» . رواه البخاري

హదీథ్

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు  మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు.

అనువాదం నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. (దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది) మరియు ఎవరైతే ప్రపంచం కోసం వలస వెళతారో వారికి అదే (ఆ ప్రపంచమే) లభిస్తుంది. ఇంకా ఎవరైతే ఒక స్త్రీని పెళ్ళాడటానికి వలస వెళతారో, వారి వలస ఆ పెళ్ళి కొరకే పరిగణింపబడుతుంది. సహీ బుఖారి హదీథ్ గ్రంథం.

వివరణ: మక్కానగరపు ఖురైషీ అవిశ్వాసులు ఇస్లాం స్వీకరించిన వారిని అనేక రకాల  అత్యాచారాలకు గురి చేసారు. ఆ బాధల నుండి తప్పించుకోవటానికి అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ముస్లింలను ముందుగా హబ్షా(యుథోపియా)కు తర్వాత మదీనాకు వలస పోవటానికి అనుమతించారు. అప్పుడు అనేక మంది ముస్లింలు మదీనాకు వలస పోయారు. ఇస్లాం కోసం వారు చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా అనేక పుణ్యాలు లభించనున్నట్లు ప్రకటింపబడినది. ఆ సమయంలో ఒకతను తనను వివాహమాడాలంటే మదీనాకు వలస చెయ్యమని షరతు విధించిన ఉమ్మె ఖైస్ అనే మహిళను పెళ్ళాడటానికి మదీనా పట్టణానికి వలస చేసినాడు. అతడికి కూడా పుణ్యాలు లభిస్తాయా లేదా అనే సందేహానికి జవాబుగా పై హదీథ్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు. ఈ హదీథ్ ఒక సాధారణ నియమాన్ని బోధిస్తున్నది.అదేమిటంటే ఎవరైనా సరే అతడు పొందే ప్రతిఫలం పూర్తిగా అతడి అసలైన సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప ఏ మాత్రం అతడు చేసే పనులపై కాదు. అవి పైకి చాలా మంచి పనులుగా కనబడినా సదుద్దేశ్యంతో కూడినవి కాకపోవచ్చు (లోపల దురుద్ధేశ్యంతో కూడినవై  ఉండవచ్చును).

ఉల్లేఖకుని పరిచయం: ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్ హు ప్రఖ్యాతి చెందిన సహాబాలలో ఒకరు. రెండవ ఖలీఫా గా ఇస్లాం రాజ్యానికి సేవలందించారు. వీరి పరిపాలనా కాలంలోనే అప్పటి అత్యంత బలవంతమైన పర్షియన్ మరియు రోమన్ సామ్రాజ్యాలను ముస్లింలు జయించారు.

ఈ హదీథ్ ద్వారా మానవజాతికి కలిగే ప్రయోజనాలు (లాభాలు):

1.  ఇస్లాం లో సంకల్పమే ఏ పనికైనా పునాది వంటిది.

2.  కేవలం అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే చిత్తశుద్ధి గల సంకల్పంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చూపిన పద్ధతి ప్రకారం ఏ పనైనా చేసినట్లైతే దానిని అల్లాహ్ తప్పక స్వీకరిస్తాడు.

3.  సరైన సంకల్పంతో నిత్యజీవితంలో చేసే ప్రాపంచిక పనులన్నింటికీ  ప్రస్తుత జీవితంలోనూ, చనిపోగానే మొదలయ్యే పరలోక జీవితంలోను ప్రతి ముస్లిం మంచి ప్రతిఫలం పొందుతాడు. ఆ పనులలోని చిత్తశుద్ధి వలన  అవన్నీ అల్లాహ్ కు సమర్పించిన ఆరాధనలుగా లెక్కించబడును. బోధించే టీచరు, చదువుకునే విద్యార్థి, లావాదేవీలు చేసే వ్యాపారస్తుడు – వీరందరూ చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కోసమే గనుక తమ తమ పనులు చేస్తున్నట్లైతే, నిజంగా వారు అల్లాహ్ ను ఆరాధిస్తున్నట్లే.

4.  ఎవరైనా  ముస్లిం మంచి పని చేయాలని సంకల్పం చేసుకుని, ఏవైనా కారణాల వలన పూర్తి చేయలేక పోయినా సంకల్పంలోని చిత్తశుద్ధి ఆధారంగా అతడికి ప్రతిఫలం లభిస్తుంది.

5.  అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే నిజమైన సంకల్పం ఈ జీవితంలోను, రాబోయే జీవితంలోను జయప్రదమైన మంచి ఫలితాన్నిస్తుంది.

6.  ఇస్లామీయ జీవనవిధానంలోని భాగమైన వుదూ చేయడం (ప్రత్యేక పద్ధతిలో ముఖం, కాళ్ళు చేతులు కడుక్కోవటం),గుసుల్ చేయటం (ప్రత్యేక వద్ధతిలో స్నానం చేయడం),తయమ్మమ్ చేయడం (నీరు దొరకని పరిస్థితిలో లేక అనారోగ్య సమయంలో పరిశుభ్రపరచుకోవడం), నమాజు చేయడం, జకాతు దానం ఇవ్వడం, హజ్ యాత్ర చేయడం, రమదాన్ నెలలోని చివరి పది రోజులు మస్జిద్ ఎతేకాఫ్ అంటే ఏకాంతవాసం చేయడం వంటి అన్ని రకాల ఆరాధనలు సరైన సంకల్పం లేకుండా ఆచరించినట్లైతే వాటిని అల్లాహ్  స్వీకరించడు మరియు ఎటువంటి ప్రతిఫలం లభించదు.

7.  ఎంత మంచి పనైనా సరే చెడు సంకల్పంతో చేసినట్లైతే అది స్వీకరింప బడదు. చేసే ప్రతి పని కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చెయ్యాలి – అది జీవిత దినచర్యైనా లేక ఆరాధనకు సంబంధించినదైనా. ఇటువంటి గొప్ప సంకల్పం వలన కలిగే అత్యంత ముఖ్యమైన లాభం అల్లాహ్ కోసమే చేస్తున్నానని నిశ్చయించుకున్నప్పుడు చెడు పనుల నుండి దూరమవటానికి అవకాశమున్నది.  ఇంకా మంచి పనులు చేయటంలో నిర్లక్ష్యం తగ్గుతుంది.

ప్రశ్నలు

 1. నిత్యజీవితం లోని మామూలు పనులు కూడా కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామనే సంకల్పం వలన కలిగే లాభాలు తెలుపండి.
 2. ఈ హదీథ్ ను మీ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారు?
 3. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గురించి క్లుప్తంగా వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా