దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం (Sweetness of Iman)

tree-iman-telugu-islamహదీథ్ ׃ 13

حلاوة الإيمان దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం

حَدَّثَنا مُحَمَّدُ بْنُ المُثَنَّى قَالَ: حَدَّثَنَا عَبْدُ الْوَهَّابِ الثَّقَفِيُّ قَالَ: حَدَّثَنَا أَيُّوبُ عَنْ أَبي قِلابَةَ عَنْ أَنْسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ”ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاوَةَ الإِيمَانِ أَنْ يَكونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إلَيْهِ مِمَّا سِواهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إلاَّ للَّهِ ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ “ رواة صحيح البخاري

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ఖాల, హద్దథనా అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ఖాల హద్దథనా అయ్యూబు అన్ అబి ఖిలాబత అన్ అన్సిన్ అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల థలాథున్ మన్ కున్న ఫీహి వజద హలావత అల్ఈమాని అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా, వ అన్ యుహిబ్బ అల్మర్ఆ లా యుబ్బుహు ఇల్లల్లాహి, వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నారి రవాహ్ సహీ బుఖారి.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ← అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ← హద్దథనా అయ్యూబు ←  అబి ఖిలాబత ← అన్సిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు మూడు (గుణములు) ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు విశ్వాసం యొక్క తియ్యటి మాధుర్యాన్ని రుచి చూస్తారు – 1)వారు కేవలం అల్లాహ్ ను మరియు దైవప్రవక్తను మాత్రమే అన్నింటి కంటే ఎక్కువగా ఇష్టపడతారు. 2)మరియు ఎదుటి మనిషిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే ప్రేమిస్తారు. 3)మరియు నరకాగ్ని భయంతో తిరిగి మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం

హదీథ్ వివరణ

విశ్వాసి యొక్క దైవవిశ్వాసపు కోరికను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) తీపిదనపు మాధుర్యం కోసం తపించే ఆకాంక్షతో పోల్చినారు. ఒక వ్యాధిగ్రస్థుడి మరియు ఒక ఆరోగ్యవంతుడి మధ్య ఉండే తేడాని ఈ హదీథ్ జ్ఞాపకానికి తీసుకు వస్తున్నది. వ్యాధిగ్రస్థుడికి తేనె కూడా చేదుగా అనిపిస్తుంది, కాని అదే తేనెలోని తియ్యదనాన్ని ఆరోగ్యవంతుడు మాధుర్యంతో రుచిచూస్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుంటుందో, రుచి చూసే శక్తి కూడా క్షీణిస్తుంది. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) మాధుర్యం (తియ్యదనం) అనే పదాన్ని వినియోగించారు ఎందుకంటే దైవవిశ్వాసాన్ని ఒక చెట్టుతో అల్లాహ్ పోల్చినాడు. దివ్యఖుర్ఆన్ లోని సూరహ్ ఇబ్రహీం 14:24 లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:“అల్లాహ్ ఉపమానాలను ఎలా ముందు ఉంచుతున్నాడో మీరు చూడటం లేదా? ఒక మంచి మాట ఒక మంచి చెట్టు వంటిది, దేని వ్రేళ్ళు అయితే బాగా పాతుకుపోయి ఉంటాయో మరియు దేని కొమ్మలు అయితే ఆకాశానికి చేరి పోతాయో ఇక్కడ మంచి పదం అంటే చిత్తశుద్ధితో కూడిన హృదయపూర్వకమైన దైవవిశ్వాసం. అదే ఏకదైవత్వపు (తౌహీద్) ప్రకటన. ఇక్కడ చెట్టు అనే పదం దైవవిశ్వాసానికి మూలబిందువు వంటిది, దాని కొమ్మలు అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించటం మరియు ఏవైతే అల్లాహ్ నిషేధించాడో వాటి నుండి దూరంగా ఉండటం వంటిది, మరియు దాని ఆకులు దైవవిశ్వాసి జాగ్రత్త వహించే ప్రతి మంచి విషయం వంటిది, మరియు దాని ప్రతిఫలమే అల్లాహ్ కు విధేయత చూపటం. ఇంకా దాని పర్యవసానంలోని మాధుర్యమే దాని ఫలాలు మరియు ఆ ఫలాలలోని తియ్యదనం.

ఉల్లేఖకుని పరిచయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సేవకుడిగా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు తన సేవలందించారు. అనేక హదీథ్ లను ఉల్లేఖించారు. 92వ హిజ్రీ సంవత్సరంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

 1. సృష్టిలోని అన్నింటి కంటే అల్లాహ్ ను మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ను ప్రేమించటం యొక్క ఆవశ్యకతను ఈ హదీథ్ తెలుపుతుంది.
 2. అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్తకు అవిధేయత చూపుతూ, ప్రజలకు విధేయులుగా ఉండటం తగదు.
 3. దైవవిశ్వాసం పరిపూర్తి కావటానికి ఒక మార్గం – ప్రతి ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కేవలం అల్లాహ్ కోసం తప్పక ప్రేమించ వలెను.
 4. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని నరకంలో పడవేయటాన్ని అసహ్యించుకున్నట్లుగా అసహ్యించుకో వలెను.
 5. ఎవరి దగ్గర అయితే పై మూడు మంచి లక్షణాలు ఉన్నాయో వారు శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు.

ప్రశ్నలు

 1. దైవవిశ్వాసపు తీపిదనం ఎవరిలో ఉంటుంది?
 2. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని ఏ విధంగా అసహ్యించుకోవలెను?
 3. ఈ హదీథ్ యొక్క ఉల్లేఖకుని గురించి క్లుప్తంగా వ్రాయండి?
 4. ప్రతి ముస్లిం తోటి ముస్లిం సోదరుడిని ఎవరి కోసం ప్రేమించాలి?
 5. శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉండటానికి ఏ ఏ లక్షణాలు ఉండవలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

చాడీలు చెప్పటం నిషేధించబడినది (Prohibition of Backbiting)

backbiting-telugu-islamహదీథ్׃ 07

تحريم النميمة చాడీలు చెప్పటం నిషేధించబడినది

حدّثنا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ ابْنُ بَشَّارٍ قَالاَ: حَدَّثَنَا مُحَمَّدُ بْنُ جَعْفٍ  حَدَّثَنَا شُعْبَةُ . سَمِعْتُ أَبَا إِسْحَـٰقَ يُحَدِّثُ عَنْ أَبِي الأَحْوَصِ عَنْ عَبْدِاللّهِ بْنِ مَسْعُودٍ قَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَ سَلَّمَ قَالَ: أَلاَ أُنَبِّئُكُمْ مَا الْعَضْهُ؟ هِيَ النَّمِيمَةُ الْقَالَةُ بَيْنَ النَّاس. رواة صحيح مسلم

హద్దథనా ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న వ ఇబ్ను బష్షారిన్ ఖాల హద్దథనా ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ హద్దథనా షుఅబతు సమియ్ తు అబా ఇస్హాఖ యుహద్దిథు అన్అబి అల్అహ్వశి అన్ అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ ఖాల, ఇన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల ఆలా ఉనబ్బి ఉకుమ్ మా అల్ అద్హు? హియన్నమీమతు అల్ ఖాలతు బైనన్నాసి రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న← ఇబ్ను బష్షారిన్← ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ ← షుఅబతు ← అబా ఇస్హాఖ ← అబి అల్అహ్వశి ← అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా ఇలా ఉపదేశించినారు. మీకు అల్ అద్హు అంటే ఏమిటో తెలుపనా? అది మానవుల మధ్య చాడీలు విస్తరింప చేయడము. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ ఉల్లేఖకుని పరిచయం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క ఇస్లాం ధర్మం సందేశాన్ని ప్రారంభంలోనే స్వీకరంచిన వారిలో ఉత్తమములలో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఒకరు.  వీరు ప్రముఖ ధర్మనిష్ఠాపరుల, ఖుర్ఆన్ పారాయణుల, ధర్మజ్ఞానకోవిదుల ప్రసిద్ధులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గర దాదాపుగా 70 ఖుర్ఆన్ అధ్యాయాలను కంఠస్థం చేసారు. 32వ హిజ్రీ సంవత్సరంలో, 60 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో వీరు మరణించారు.

హదీథ్ వివరణ

ఇస్లాం ధర్మం ప్రజలకు పరస్పర ప్రేమాభిమానాలతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆదర్శవంతంగా జీవితం గడపే మంచి మార్గం వైపునకు దారిచూపుతున్నది. ఇంకా పరస్పర వైషమ్యాలు, ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు, భేదాలు కూడదని నివారిస్తున్నది. ప్రజల మధ్య ప్రేమాభిమానాలను తుడిచిపెట్టి, వారిలో సంఘీభావాన్ని, కలిసిమెలిసి జీవించటాన్ని ముక్కలుముక్కలు చేసే అత్యంత ప్రమాదకరమైన దురలవాటు చాడీలు చెప్పటం. దీని వలన ప్రజల హృదయాలలో కోపతాపాలు భగ్గుమంటాయి. ఒకరినొకరు అసహ్యించుకోవటం మొదలవుతుంది.  మంత్రగాళ్ళు సంవతర్సరకాలంలో లేపలేని అలజడిని, అపోహలను, అల్లర్లను ఒక్కోసారి చాడీలు మరియు అబద్ధాలు చెప్పేవారు కేవలం ఒక గంటలోనే లేపుతారు. కాబట్టి, ధర్మవిద్య నేర్చుకునే సోదరులారా! మీరేదైనా విషయం విన్నప్పుడు దానిలోని సత్యాసత్యాలను, నిజానిజాలను, వాస్తవాలను బాగా పరిశోధించ వలెను, పరిశీలించ వలెను మరియు, పరీక్షించ వలెను. తెలిసిన వారు చెబుతున్నారు కాదా అని గ్రుడ్డిగా నమ్మరాదు. కేవలం సందేహం మరియు అనుమానం మీద ఆధార పడవద్దు. ఖుర్ఆన్ లోని అల్ హుజురాత్ అనే అధ్యాయంలో 6వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِنْ جَاءَكُمْ فَاسِقٌ بِنَبَأٍ فَتَبَيَّنُوا أَنْ تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَى مَا فَعَلْتُمْ نَادِمِينَ(6)

దైవవిశ్వాసులారా!  ఎవరైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, నిజానిజాలు విచారించి తెలుసుకోండి. అలా చేయకపోతే, మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు, తర్వాత చేసినదానికి పశ్చాత్తాప పడవలసి రావచ్చు.

కాబట్టి ఎల్లప్పుడూ చాడీలు చెప్పేవారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటువంటి వారికి సమాజంలో గౌరవమర్యాదలు ఉండవు. ఇంకా అటువంటి వారిలో మంచి నడవడిక కూడా ఉండదు. అటువంటి వారి యొక్క ఏకైక లక్ష్యం ప్రజలు కష్టం కలిగించటం మరియు బాధలకు గురిచేయటం. ఎదుటి వారు కష్టనష్టాలలో కూరుకు పోవటం చూసి సంతోషపడతారు. అటువంటి నుండి అల్లాహ్ మమ్ముల్ని కాపాడు గాక! ఆమీన్.

ఈ హదీథ్ వలన కలిగే లాభాలు:

 1. చాడీలు చెప్పటం మరియు అపవాదాలు వేయటం హరామ్, ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించినది.
 2. చాడీలు చెప్పటమనేది అత్యంత ఘోరమైన పాపాలలో పరిగణించబడుతుంది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

మోసం చేయటం నిషేధించబడినది (Prohibition of deceiving)

హదీథ్׃ 06

تحريم الغش మోసం చేయటం నిషేధించబడినది

حَدَّثَنِي يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ قُتَيْبَةُ وَ ابْنُ حُجْرٍ . جَمِيعا عَنْ إِسْمَاعِيلَ بْنِ جَعْفَرٍ . قَالَ ابْنُ أَيُّوبَ : حَدَّثَنَا إِسْمَاعِيلُ . قَالَ: أَخْبَرَنِي الْعَلاَءُ عَنْ أَبِيْهِ، عَنْ أَبِي هُرَيْرَةَ   ”أَنَّ رَسُولَ اللَّهِ مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ، فَأَدْخَلَ يَدَهُ فِيهَا، فَنَالَتْ أَصَابـِعُهُ بَلَلاً،فَقَالَ: مَا هذَا يَا صَاحِبَ الطَّعَامِ ؟ قَالَ: أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللَّهِ ! قَالَ: أَفَلاَ جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ كَيْ يَرَاهُ النَّاسُ، مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي “ رواة صحيح مسلم

హద్దథని యహ్యా ఇబ్ను అయ్యూబ వ ఖుతైబతు వ ఇబ్ను హుజ్రిన్, జమీఆన్ అన్ ఇస్మాయీల ఇబ్ని జాఫరిన్, ఖాల ఇబ్ను అయ్యూబ, హద్దథనా ఇస్మాయీలు, ఖాల అఖ్బరనీ అల్ అలాఉ అన్ అబీహి, అన్ అబీ హురైరత  అన్న రసూలుల్లాహి మర్ర అలా శుబ్రతి తఆమిన్, ఫఅద్ఖల యదహు ఫీహా, ఫనాలత్ అశాబిఉహు బలలన్, ఫఖాల మాహాదా యా శాహిబత్తాఆమి? ఖాల అశాబత్ హుస్సమాఉ యా రసూలల్లాహ్ ఖాల అఫలా జఅల్తహు ఫౌఖ అత్తఆమి కై యరాహు అన్నాసు, మన్ గష్ష ఫలైస మిన్నీ రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← యహ్యా ఇబ్ను అయ్యూబ ← ఖుతైబతు వ ఇబ్ను హుజ్రిన్ ← జమీఆన్ అన్ ఇస్మాయీల ఇబ్ని జాఫరిన్ ← ఇబ్ను అయ్యూబ ← ఇస్మాయీలు ← అల్ అలాఉ అన్ అబీహి ← అబీ హురైరత (రదియల్లాహుఅన్హు) ← అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ఒకసారి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆహార ధాన్యపు గుట్ట దగ్గర నుండి పోవటము జరిగినది, అప్పుడు వారు తమచేతిని ఆధాన్యం లోనికి జొప్పినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క చేతివ్రేళ్ళకు తేమ తగిలినది(నీటితో తనవ్రేళ్ళు తడిసిపోయినవి) అప్పుడు వారు ఆహర ధాన్యం విక్రయించే వాడితో ఏమిటి ఇది? అని అడిగినారు. అతను ఇలా జవాబు చెప్పినాడు  ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇది ఆకాశం నుండి కురిసిన వర్షం వలన నెమ్ము అయినది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించినారు, నీవు ఈ తడిసిన ధాన్యమును అందరికి కనపడే విధంగా పైన ఎందుకు ఉంచలేదు?,  దానిని ప్రజలందరు చూడగలిగేవారు కదా! ఎవరైతే మోసం చేస్తాడో అతడు నావాడు కాజాలడు. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

ఉల్లేఖకుని పరిచయం:

అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

అవిధేయత మరియు అబద్ధపు సాక్ష్యం నిషేధింపబడినది (Disobedience and Lying)

హదీథ్׃ 05

تحريم العقوق وشهادة الزور

అవిధేయత మరియు అబద్ధపు సాక్ష్యం నిషేధింపబడినది

حَدَّثَني عَمْرُو بْنَ مُحمَّدُ بْنُ بُكَيرِ بْنِ مُحمَّدٍ النَّاقِدُ . حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ عُلَيَّةَ عَنْ سَعِيدٍ الْجُرَيْرِيِّ . حَدَّثَنَا عَبْدُ الرَّحْمٰنِ بْنُ أَبِي بَكْرَةَ عَنْ أَبِيهِ قَالَ: كُنَّا عِنْدَ رَسُولِ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَ سَلَّمَ  فَقَالَ:   ”أَلاَ أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ؟ ثَلاَثاً :ا‌‌لإِشْرَاكُ بِاللَّهِ. وَعُقُوقُ الْوَالِدَيْنِ. وَشَهَادَةُ الزُّورِ، أَوْ قَوْلُ الزُّورِ “ وَكَانَ رَسُولُ اللَّهِ صَلَّىاللَّهُ عَلَيْهِ وَ سَلَّمَ مُتَّكِئًا فَجَلَسَ. فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى قُلْنَا: لَيْتَهُ سَكَتَ ! : متفق عليه

హద్దథని అమ్రు ఇబ్న ముహమ్మదు ఇబ్ను బుకైరి ఇబ్ని ముహమ్మదిన్ అన్నాఖిదు, హద్దథనా ఇస్మాయీలు ఇబ్ను ఉలైయ్యత అన్ సయీదిన్ అల్ జురైరియ్యి, హద్దథనా అబ్దుర్రహ్మాని ఇబ్ను అబి బకరత అన్ అబిహి ఖాలా కున్నా ఇంద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఫఖాల అలా ఉనబ్బిఉకుమ్ బిఅక్బరి అల్ కబాయిరి థలాథ, అల్ ఇష్రాకు బిల్లాహి, వ ఉఖూఖుల్ వాలిదైని, వ షహాదతుజ్జూరి, అవ్ ఖౌలుజ్జూరి వ కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ముత్తకిఅన్ ఫజలస ఫమా జాల యుకర్రిరుహా హత్తా ఖుల్నా లైతహు సకత! ముత్తఫఖున్ అలైహ్

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీబుఖారీ మరియు సహీముస్లిం హదీథ్ గ్రంధకర్తలు ← అమర్ ఇబ్ను ముహమ్మద్ ఇబ్ను బుకైరి ఇబ్ని ముహమ్మదిన్ అన్నాఖిదు ← ఇస్మాయీలు ఇబ్ను ఉలైయ్యత అన్ సయీదిన్ అల్ జురైరియ్యి ← అబ్దుర్రహ్మాన్ ఇబ్ను అబి బకరత ← అబి బకరత (రదియల్లాహుఅన్హు) ← అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) – ఒకసారి మేము అల్లాహ్ యొక్క  ప్రవక్త సన్నిధిలో ఉన్నాము, అప్పుడు వారుఘోరాతి ఘోరమైన పాపముల గురించి మీకు తెలుపనా? అవి మూడు

 1. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించటం.
 2. తల్లిదండ్రులకు అవిధేయత చూపటం.
 3. అబద్దపుసాక్ష్యంపలకటంఅనిబోధించారు.

 

అప్పటి వరకు ఏటవాలుగా ఒకవైపు ఒరిగి కూర్చుని ఉన్న దైవప్రవక్త, ఒకేసారి నిటారుగా కూర్చున్నారు మరియు వారు ఆ మాటలనే మళ్ళీమళ్ళీ “అలా పలకటం ఆపివేసి, నిశ్శబ్దంగా ఉంటే ఎంత బాగుండును” అని మేము కోరుకునేటంతటి వరకు అనేక సార్లు పలికారు. ముత్తఫఖున్ అలైహ్

హదీథ్ వివరణ

ఘోరమైన మహాపాపములు అనేకం ఉన్నాయి మరియు అన్నింటి కంటే ఘోరాతిఘోరమైన మహాపాపం – ‘అల్లాహ్ కు అతడి దివ్యకార్యములలో లేక అతడిని ఆరాధించటంలో లేక అతడి శుభమైన నామములలో లేక అతడి అత్యున్నతమైన గుణములలో భాగస్వామిని కల్పించటం.’ ఇస్లాం ధర్మంలో ఇది అత్యంత ఘోరాతి ఘోరమైన మహాపాపం గనుక, దైవప్రవక్త ఈ మహాపాపంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత, వారు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం అనే మరో ఘోరమైన మహా పాపం గురించి తెలిపారు. తల్లిదండ్రులకు అవిధేయత చూపే ప్రజలు భయంకర శిక్ష అనుభవిస్తారని అల్లాహ్ హెచ్చరించెను. బాల్యం నుండి జాగ్రత్తగా, కరుణతో పెంచి పోషించినందుకు, ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించవలెను, మర్యాదగా చూడవలెను. మరియు వినయవిధేయతలతో, నమ్రతగా వారితో మెలగమని అల్లాహ్ మనల్ని ఆదేశించెను. మరియు వారికి అవిధేయత చూపటాన్ని అల్లాహ్ నిషేధించెను.  ఖుర్ఆన్ సూరహ్ అల్ ఇస్రా 17: 23-24 లోని క్రింది వచనాలు-

“నీ ప్రభువు ఇలా నిర్ణయించాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా “ఉహ్ (లేక ఛీ)” అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయ కలిగి, వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి “యా రబ్ (ఓ ప్రభూ)! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు”

ప్రతి ముస్లిం తప్పనిసరిగా తన తల్లిదండ్రుల మాట వినవలెను, వారికి విధేయత చూపవలెను, వారిని గౌరవించవలెను. ఎందుకంటే పాపపు పని చేయమని ఆదేశించనంత వరకు, వారు చెప్పినట్లు నడుచుకోవటం మీ బాధ్యత. వారికి అవిధేయత చూపటం ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిషేధించబడినది.

మరొక నిషేధింపబడిన పని – అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం మరియు నిజం పలకటం నుండి కావాలని (సంకల్ప పూర్వకంగా) దూరంగా పోవటం.  అబద్ధం చెప్పటం మరియు అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం అనే తీవ్రమైన తప్పు గురించి తన సహచరులకు బోధించటంలో దైవప్రవక్త ఎక్కువ ధ్యాస చూపేవారు. ఎందుకంటే మాట జారటం నాలుకకు చాలా తేలికైన పని మరియు ప్రజలు ఈ భయంకరమైన మహాపాపం గురించి తరచుగా అజాగ్రత్త వహిస్తారు. ఈ ఘోరమైన మహాపాపానికి అసూయ, వోర్వలేని తనం, ద్వేషం, ఈర్ష్య, శత్రుత్వం, దుష్టభావం, పగ వంటి అనేక చెడు విషయాలు కారణం కావచ్చును. ‘ఈ హెచ్చరికను ఇక ఆపరేమో’ అని తోటి సహచరులు అనుకునే వరకు దైవప్రవక్త దీనిని అనేక సార్లు పలికారు.

కాబట్టి ముస్లింలు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినశిక్షకు గురిచేసే ఈ ఘోరాతి ఘోరమైన ఈ మహాపాపములలో ఏ ఒక్కటీ చేయకుండా జాగ్రత్త వహిస్తూ, తమను తాము కాపాడుకోవలెను మరియు ఇతరులను కూడా కాపాడటానికి ప్రయత్నించవలెను.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

 1. దైవప్రవక్త తన సహచరులకు బోధించిన మార్గదర్శకత్వం మరియు హితవులు మొత్తం మానవజాతికి కూడా వర్తిస్తాయి, వాటిని ఆచరిస్తే తప్పక ప్రయోజనం కలుగుతుంది.
 2. అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం మరియు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం నిషేధించబడినది.
 3. అబద్ధం చెప్పటం మరియు తప్పుడు సాక్ష్యం ఇవ్వటం నిషేధించబడినది.
 4. దైవప్రవక్త పై వారి సహచరులు చూపించిన భక్తి మరియు దైవప్రవక్తను చికాకు పెట్టకుండా సహనంతో ప్రవర్తించటం ద్వారా సహచరులలోని గొప్ప లక్షణాలు తెలుస్తున్నాయి.

ప్రశ్నలు

 1. దైవప్రవక్త తెలిపిన ఘోరాతిఘోరమైన మహాపాపములు ఎన్ని? అవి ఏవి?
 2. అబద్ధం చెప్పటం లేక తప్పుడు సాక్ష్యమివ్వటానికి గల కారణాలేమిటి?
 3. తల్లిదండ్రుల కోసం మనం ఏమని ప్రార్థించవలెను?(ఖుర్ఆన్ ఆధారంగా)
 4. ఈ హదీథ్ ద్వారా మీరు గ్రహించిన విషయాలేమిటి?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

నిజాయితీగా వాపసు చెయ్యటం (Returning honestly)

హదీథ్׃ 04

أداء الأمانة నిజాయితీగా వాపసు చెయ్యటం

حدثنا أبُو كُرَيْبٍ، حدَّثنَا طَلْقُ بنُ غَنَّامٍ عنْ شَرِيكٍ وَ قَيْسٌ عَنْ أَََبي حَصِينٍ ، عَنْ أبي صَالَحْ عَنْ أَبي هُرَيْرَة  قَالَ، قَالَ النَبِيّ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ  ”أَدِّ الأمَانَةَ إِلَى مَنِ أْتَـمَنَكَ ، وَلاَ تَخُنْ مَنْ خَانَكَ رواة أحمد و أبوداود و التِّرْمِذِي

హద్దథనా అబు కురైబిన్ హద్దథనా తల్ఖు ఇబ్ను గన్నామిన్ అన్ షరీకిన్ వ ఖైసున్ అన్ అబి హసీనిన్ అన్ అబి శాలహ్ అన్ అబి హురైరత ఖాల, ఖాలన్నబియ్యి సల్లల్లాహు ఆలైహి వ సల్లమ అద్ది అల్ అమానత ఇలా మనిఁ తమనక, వలాతఖున్ మన్ ఖానక .  రవాహ్ అహమద్, అబుదావూద్, తిర్మిది .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) అహమద్, అబుదావూద్, తిర్మిది హదీథ్ గ్రంధకర్తలు ← అబు కురైబిన్ ← తల్ఖు ఇబ్ను గన్నామిన్ ← అన్ షరీకిన్ ←  ఖైసున్ అన్ అబి హసీనిన్ ← అబి శాలహ్ ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు)  ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ప్రకటించారు.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ఏదైతే నమ్మకంతో మీ దగ్గర ఉంచబడినదో, దానిని వారికే నిజాయితితో తిరిగి అప్పగించండి. మరియు ఎవరైతే మిమ్మల్ని మోసగించారో వారిని మీరు తిరిగి మోసగించవద్దు (అంటే మోసగాళ్ళతో కూడా నిజాయితి తోనే వ్యవహరించ వలెను). అహమద్, అబుదావూద్, తిర్మిది హదీథ్ గ్రంధాలు

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

హదీథ్ వివరణ

నమ్మకంగా మీ దగ్గర ఉంచిన వస్తువును, నిజాయితీగా దాని యజమానికి తిరిగి ఇచ్చివేయమని (వాపసు చేయమని) ఈ హదీథ్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. వాడుకోవటానికి తీసుకున్న పనిముట్లయినా, తాకట్టు పెట్టిన వస్తువులైనా సరే ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. వీటిని కూడా చాలా జాగ్రత్తగా, నమ్మకంగా వాటి యజమానికి తిరిగి ఇవ్వవలెను. ఇస్లాం ధర్మంలో నిజాయితీకి చాలా ఉన్నత స్థానమున్నది. నిజాయితీకి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి ముస్లిం దీనిని తప్పని సరిగా, సీరియస్ గా పాటించవలెను. నిజాయితీగా ఉండటం వలన ప్రజలు గౌరవిస్తారు. ప్రజలు నిజాయితీ పరులపై నమ్మకం ఉంచుతారు, వారిపై భరోసా ఉంచుతారు. బంధుమిత్రులు వారిని గౌరవాభిమానాలతో చూస్తారు. ఉదాహరణకు నిజాయితీగా ఇతరుల హక్కులను పూర్తిచేసే ఉపాధ్యాయులు, గురువులు ప్రతిచోట ఆదరించబడతారు. వారు అల్లాహ్ తరుపు నుండి మరియు అక్కడి ప్రజల తరుపు నుండి తెలుపబడే కృతజ్ఞతలు స్వీకరించటానికి అర్హులు. అలాగే నిజాయితీగా విద్యనభ్యసించే విద్యార్థి కూడా నిజాయితీ పరుడిగా గుర్తింపు పొందుతాడు. ఇతరుల వస్తుసామగ్రీని, ధనసంపదలను కాపాడి, వారికి చేర్చే వాడు కూడా తన నిజాయితీకి సరైన పుణ్యాలు పొందుతాడు. ఎవరైతే నిజాయితీగా జీవించరో, ఇతరుల వస్తువులను నిజాయితీగా తిరిగి ఇవ్వాలని ప్రయత్నించరో, వారు ప్రజల దృష్టిలో చులకనైపోతారు. మరియు అల్లాహ్ తరుపు నుండి కఠిన శిక్షలకు గరువుతారు.

అతడు ఉద్యోగస్తుడైతే, అతడి ఉద్యోగం ఏదో ఒకరోజున పోతుంది. వ్యాపారస్తుడైతే, ప్రజలలో నమ్మకం పోగొట్టుకుంటాడు.  కాబట్టి ప్రతి ముస్లిం, తన దగ్గర ప్రజలు ఉంచిన వాటిని, వాటి వాటి యజమానులకు జాగ్రత్తగా చేర్చవలెను. వాటికి ఎటువంటి నష్టం గాని, అపాయం గాని చేకూర్చకూడదు. వస్తుసామగ్రి మాత్రమే కాకుండా, ఇతరుల రహస్యాలను, వ్యవహారాలను, గౌరవ మర్యాదలను కూడా నిజాయితీగా కాపాడ వలెను. ఇతరులతో సంప్రదాయబద్ధంగా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలిసిమెలిసి పూర్తి నిజాయితీతో  జీవించవలెను. ఎందుకంటే ఎవరి దగ్గరైతే నిజాయితీ ఉండదో, వారి దగ్గర దైవవిశ్వాసం (ఈమాన్) కూడా ఉండదు.

హదీథ్ వలన కలిగే లాభాలు

 1. నమ్మకంగా ఉంచబడిన దానిని, దాని యజమాని వద్దకు జాగ్రత్తగా తిరిగి చేర్చటం తప్పని సరి బాధ్యత.
 2. నిజాయితీగా వాపసు చెయ్యక, మోసం చేసేవారితో బదులుగా మోసం చెయ్యడం నిషేధించబడినది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇస్లాం ధర్మం లంచమును నిషేధిస్తున్నది (prohibition of bribery)

bribery-telugu-islamహదీథ్׃ 03

الإسلام يحرم الرشوة ఇస్లాం ధర్మం లంచమును నిషేధిస్తున్నది

حَدَّثَنَا عَبْدِ اللهِ، حَدَّثَنِي أَبِي، حَدَّ ثَنَا وَكِيعٌ، حَدَّ ثَنَا ابْنُ أَبِي ذِئْبٍ، عَنْ خَالِهِ الحْا رِثِ بْنِ عَبْدُ الرَّحْمَنْ، عَنْ أَبي سَلَمَةَ بِنْ عَبْدُ الرَّحْمَنْ، عَنْ عَبْدُ اللهِ بْنُ عَمْرٍو  قال:لَعَنَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الرَّاشِي َوَالمْرُْتَشِي

رواة مسند أحمد

హద్దథనా అబ్దిల్లాహి, హద్దథని అబి , హద్దథనా వకీయున్, హద్దథనా ఇబ్ను అబి దిబిన్ , అన్ ఖాలిహి అల్ హారిథి ఇబ్ని అబ్దుర్రహ్మాన్, అన్ అబి సలమత బిన్ అబ్దుర్రహ్మాన్, అన్ అబ్దుల్లాహిబ్ను అమ్రిన్ ఖాల లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ అర్రాషియ వల్ ముర్తషియ రవాహ్ ముస్నద్ అహమద్.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) ముస్నద్ అహమద్ హదీథ్ గ్రంధకర్త ← అబ్దిల్లాహి ← అబి ← వకీయున్ ← ఇబ్ను అబి దిఁబిన్ ← అన్ ఖాలిహి అల్ హారిథి ఇబ్ని అబ్దుర్రహ్మాన్ ← అన్ అబి సలమత బిన్ అబ్దుర్రహ్మాన్ ← అన్ అబ్దుల్లాహిబ్ను అమ్రిన్ (రదియల్లాహుఅన్హుమా) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ప్రకటించారు

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) లంచం ఇచ్చేవారు మరియు లంచం పుచ్చుకునే వారిపై నుండి అల్లాహ్ యొక్క కరుణ తొలిగి పోవుగాక అని మరియు అల్లాహ్ యొక్క తిరస్కారం కలుగు గాక అని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం శపించినారు”. ముస్నద్ అహమద్ హదీథ్ గ్రంధం

ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం – అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆశ్ బిన్ వాయల్ అస్సహ్మి రదియల్లాహు అన్హుమా  తన తండ్రి కంటే ముందుగా ఇస్లాం స్వీకరించారు.

హదీథ్ వివరణ ׃

లంచం ఇచ్చేవారు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలకు దూరం కావాలని మరియు అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాలు వారిపై కురవకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం శపించినట్లుగా అబ్దుల్లాహ్ బిన్ అమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథ్ ద్వారా మనకు తెలుస్తున్నది. అరబీభాషలోని అర్రాషీ అనే వ్యక్తి ఎవరంటే – ప్రేమాభిమానాలు, చనువు ప్రదర్శిస్తూ, ధనం, బంగారం, స్థలం, భవనం, తోట వంటి విలువైన కాలుకులు బహుమతిగా ఇచ్చి, దానికి బదులుగా ఇతరుల హక్కును స్వయంగా పొందటానికి ప్రయత్నించేవాడు. ఈ విధంగా ఇతరుల హక్కును కొల్లగొట్టటానికి ప్రయత్నించటం ఇస్లాం ధర్మంలో నిషేధించబడినది.  ఇదే విధంగా లంచం తీసుకునే వారిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.  ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను హరాం (నిషిద్ధమైన) పద్ధతిలో స్వంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ముస్లింలు ఇటువంటి సందేహాస్పదమైన పరిస్థితుల నుండి చాలా దూరంగా ఉండవలెను. ఈ విధంగా వారు అల్లాహ్ యొక్క కోపం నుండి, ఆగ్రహం నుండి తమను తాము రక్షించుకునే అవకాశం ఉన్నది.

హదీథ్ ఆచరణ వలన కలిగే లాభాలు׃

 1. లంచం ఇచ్చేవారు, లంచం పుచ్చుకునే వారు  అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాల నుండి దూరం కావటం.
 2. లంచాన్ని ఇస్లాం పూర్తిగా నిషేదిస్తున్నది. ఎందుకంటే ఇది సమాజానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఈర్ష్యాద్వేషాల నిషేధం (Prohibition of Envy)

hasad-envy-telugu-islamహదీథ్׃ 02

تحريم التباغض والتحاسد ఈర్ష్యాద్వేషాల నిషేధం

మానవుల మధ్య శత్రుత్వం పెంపొందించే పగ, వైరం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనంమొదలైన చెడు(దుష్ట)గుణాలు ఇస్లాంలో అనుమతింపబడలేదు.

عَنْ   أَ نَسِ  بْنِ مَالِكٍ رَضِي اللهُ عَنْهُ  أَنَّ رَسُولُ اللِه صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  قَالَ: ” لَا تَبَاغَضُوْا ،  وَلَا تَـحَاسَدُوْا ، وَلَا تَدَابَرُوْا،   وَكُوْنُوْا عِبَادَ اللهِ  إِخْوَانًا ،  وَلَا يـَحِلُّ لِـمُسْلِمٍ  أَنْ يـَهْجُرَ  أَخَاهُ  فَوْقَ  ثَلَاثَةِ أَ يَّامٍ” متفق عليه

అన్ అనసిబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు – అన్నరసూలల్లాహి (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఖాల, “లా తబాగదూ, వలా తహాసదూ, వలా తదాబరూ, వకూనూ ఇబాదల్లాహి ఇఖ్ వానా, వలా యహిల్లు లి ముస్లిమిన్, ఐఁయ్యహ్ జుర అఖాహు ఫౌఖ తలాతతి అయ్యామ్” ముత్తఫిఖున్ అలైహి

అనస్ ఇబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా హితోపదేశం చేశారు “1. మీరు ద్వేషించుకోవద్దు. 2. మీరు అసూయ (ఈర్ష్య) పడవద్దు. 3. మీరు ఒకరికొకరు వీపు చూపుకోవద్దు (దూరం కావద్దు) మరియు అల్లాహ్ దాసులై సహోదరులుగా ఉండండి. తోటి సోదరులతో మూడు రోజులకంటే ఎక్కువగా (అయిష్టంతో) మాట్లాడకుండా ఉండడం ముస్లింలకు అనుమతింపబడలేదు” (బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)

హదీథ్ వివరణ

ఈ హదీథ్ ద్వారా ముస్లింలు తమలో తాము ఏవిధంగా సోదరభావంతో ప్రేమ, సామరస్యం (పొందిక), సానుభూతి(ఇతరుల దు:ఖంలో పాలుపంచుకోవడం) వంటి మంచి గుణాలు కలిగి ఉండాలో ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లమ్) మనకు బోధించారు. ఇంకా ఉన్నతమైన లక్షణాలకు పునాది అయినటువంటి మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఎలా మనలను చెడు నడవడికకు దూరంగా ఉంచుతుందో, మన హృదయాలను ద్వేషం మరియు దురుద్దేశం నుంచి విముక్తి కలిగిస్తుందో తెలుపబడినది. నిష్కపటమైన మరియు పారదర్శకతతో కూడిన పరస్పర సోదరభావం అత్యున్నతమైన ఇస్లామీయ జీవన విధానానికి దారి చూపుతుంది. ఈ హదీథ్ ద్వారా తెలిసే మరొక ముఖ్య విషయం – కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఏర్పడిన ముస్లిం సోదరబంధం (పరస్పర సహాయానికి ఏర్పడిన సోదరబంధం) రక్తసంబంధం కంటే ఎంతో గొప్పది. అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగా ఏర్పడటం వలన ఆ బంధంలో పూర్తి నిజాయితీ ఉంటుంది. ఇతరులకు నిస్వార్ధసేవ చేయటం ద్వారా అల్లాహ్ ను ఇష్టపరచడానికి చేసే కృషి సఫలం కావటానికి, తోటివారికి కీడుచేసే పనులనే కాకుండా అటువంటి ఆలోచనలను కూడా తన దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి సరైన కారణం లేకుండా తోటి ముస్లిం సోదరుడి నుండి 3 రోజులకంటే ఎక్కువగా  అయిష్టతతో దూరంగా ఉండకూడదు. ఇక్కడ సరైన కారణం అంటే – చెడు అలవాట్లు ఉన్నవారికి కావాలని దూరంగా ఉండటం వలన అతడు తను చేసే పాపకార్యాలను వదిలివేస్తాడేమో లేదా అతని చెడు అలవాట్లు తనమీద ప్రభావం చూపుతాయోమో అనే భయం, కారణం.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు׃

 1. ద్వేషం, అసూయ, పరోక్షంలో నిందించటం (చాడీలు చెప్పటం) తత్కాలావేశానికి వశం కావడం ఇస్లాం లో నిషేధించబడినది.
 2. ఎట్టి పరిస్థితిలోను ఇతర ముస్లిం సోదరునికి హాని కలిగించకూడదు.
 3. మూడు రోజులకంటే ఎక్కువగా ఒక ముస్లిం సోదరుని వెలి పెట్టడం నిషేధించబడినది.
 4. సోదరత్వం మరియు ప్రగాఢ సంబంధం ముస్లింల మధ్య స్థిరపడాలి.

ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించినవారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

ప్రశ్నలు

 1. లా _______, వలా _______, వలా _______, వకూనూ ఇబాదల్లాహి ఇఖ్ వానా, వలా _______ లిముస్లిమిన్, అయియ్యహ్ జుర అఖాహు ఫౌఖ _______అయ్యామ్.
 2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా హితోపదేశం చేశారు  1. మీలో ఒకరినొకరు _____కోకూడదు. 2. మీ మధ్య _______ ఉండకూడదు. 3. ఒకరినొకరు _____ చూపుకోవద్దు (దూరం కావద్దు).
 3. ఏ ముస్లిం కూడా తోటి ముస్లిం సోదరుడితో _______రోజులకంటే ఎక్కువగా అయిష్టంతో దూరంగా ఉండడం (మాట్లాడకపోవడం) అనుమతింపబడలేదు.
 4. ముస్లింలు తమలో తాము _______తో ప్రేమ, సామరస్యం (పొందిక), సానుభూతి (ఇతరుల దు:ఖంలో పాలుపంచుకోవడం) వంటి మంచి గుణాలు కలిగి ఉండాలి.
 5. ఉన్నతమైన లక్షణాలకు పునాది ______________ ప్రవర్తన.
 6. మర్యాదపూర్వకమైన ప్రవర్తన _______నడవడికకు దూరంగా ఉంచుతుంది.
 7. మర్యాదపూర్వకమైన ప్రవర్తన హృదయంలోని ______ మరియు _____తొలగిస్తుంది.
 8. నిష్కపటమైన మరియు పారదర్శకతతో కూడిన ______________అత్యున్నతమైన ఇస్లామీయ జీవన విధానానికి దారి చూపుతుంది.
 9. కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఏర్పడిన ______బంధం (పరస్పర సహాయానికి ఏర్పడిన సోదరబంధం) _______సంబంధం కంటే ఎంతో గొప్పది.
 10. కేవలం అల్లాహ్ కోసమే ఏర్పడిన సోదర బంధంలో పూర్తి _______ఉంటుంది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్