సలాతుల్ జుమహ్

సలాతుల్ జుమహ్ (శుక్రవారపు మధ్యాహ్న నమాజు):

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ وَذَرُوا البَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ

ఖుర్ఆన్, సూర జుమహ్ 62 ఆయత్ 9“ఓ విశ్వాసులారా !  శుక్రవారం సమావేశం రోజున నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు మీరు వెంటనే అమ్మకం, కొనుగోళ్ళ వ్యవహారాలు(లావాదేవీలను) వదిలేసి అల్లాహ్ స్మరణ (ధర్మబోధ) వైపు పరుగెత్తండి. మీరు అర్థం చేసుకో గలిగితే (జ్ఞానవంతులైతే) ఇది మీకెంతో శ్రేయస్కరమైనది.”

జుమహ్ ప్రాముఖ్యత:

ముస్లిం హదీథ్:  అబూహురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు “సూర్యుడు ఉదయించే రోజులలో అన్నింటి కంటే ఉత్తమమైన రోజు జుమ్అహ్ రోజు. ఆ రోజునే ఆదం అలైహిస్సలామ్ సృష్టించబడ్డారు. అదే రోజున స్వర్గంలో ప్రవేశింపజేయబడ్డారు. అదే రోజున స్వర్గం నుండి తీయబడ్డారు. మరియు జుమ్అహ్ రోజునే ప్రళయదినం వాటిల్లుతుంది.”

సలాతుల్ జుమహ్ యొక్క వివరములు:

  1. జుమహ్ సమయము: జుహర్ నమాజు సమయమే.
  2. వ్యక్తుల సంఖ్య: కనీసం ముగ్గురు మగవారు ఉన్నప్పుడు మాత్రమే జుమ్అహ్ నమాజు జరుగును. వారిలో ఒకరు ఇమాం అవుతారు.
  3. ప్రసంగం: రెండు ప్రసంగములు జరుపవలెను. అల్లాహ్ పై ప్రజల విశ్వాసాన్ని బలపరచే బోధనలు ప్రసంగించడం తప్పని సరి. సమాజములోని చెడులను దూరం చేసేటట్లు బోధించవలెను.
  4. సలాహ్: రెండు  రకాతులు ఫరద్ బిగ్గరగా చదవవలెను.

గమనిక: ఎవరైనా ఇమాము రెండవ రకాతు రుకూ నుండి నిలబడిన తర్వాత వచ్చిన ఎడల అతను 4 రకాతులు జుహర్ చదవవలెను. అంటే అతను జుమహ్ కోల్పోయెను.

  1. జమహ్ తర్వాత చదివే సున్నహ్ నమాజులు: సలాతుల్ జుమహ్ తర్వాత మస్జిద్ లోనే సున్నతులు చదివిన ఎడల 4 రకాతులు, ఇంటిలో సున్నతులు చదివిన ఎడల రెండు రకాతులు చదవవలెను.

క్రింది విషయాలు అస్సలు చేయకూడదు:

  1. జుమహ్ ఖుత్ బా సమయంలో ఎవ్వరితోను ఎట్టి పరిస్థితులలోను మాట్లాడరాదు.
  2. మోకాళ్ళను నుంచోబెట్టి, కూర్చోరాదు. అనవసరమైన, అసహ్యకరమైన చేష్టలు చేయరాదు.
  3. ముందు వచ్చినవాళ్ళు ముందు వరుస (సఫ్)లో తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత సఫ్ లలో క్రమశిక్షణతో కూర్చోవలెను. ప్రజల పై నుండి దాటి వెళ్ళరాదు.

జుమహ్ సలాహ్ కొరకు యారవ్వవలసిన విధానం(సున్నహ్) :  

  1. స్నానం చేసి శుభ్రమైన మంచి బట్టలు ధరించుట
  2. మస్జిద్ లో తొందరగా హాజరవడం
  3. అతి ఎక్కువగా దరూద్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై) పంపుట.
  4. సూరె కహాఫ్ (18 వ సూర) చదువుట.
  5. జుమహ్ రోజున సూర్యాస్తయమమునకు ముందు మేలు కొరకు, క్షమాపణ కొరకు దుఆ చేయుట
  6. జుమహ్ కు ముందు రెండు రకాతులు తహయ్యతుల్ మస్జిద్ తప్పక చదవవలెను.

జుమహ్ ప్రసంగ విధానము:

  1. ఖతీబ్ మెంబరు పై ప్రజల వైపుకు తిరిగి నిలుచొని‘అస్సలాముఅలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతహు’ అని పలికి కూర్చోవలెను.
  2. ఖతీబ్ కూర్చొన్న తర్వాత ముఅద్దిన్ అదాన్ పలక వలెను.
  3. అదాన్ తర్వాత ఖతీబ్ నుంచుని మొదటి ఖుత్బా చదవవలెను.

a)    ఖుత్బాలో ఇన్నల్ హందులిల్లాహ్ తో ప్రారంభించాలి.

b)   ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై దరూద్ సలాం పంపాలి. ప్రసంగ విషయానికి సంబంధించి ఏదైనా ఒక ఖుర్ఆన్ ఆయహ్ పఠించాలి.

c)    ప్రజలను అల్లాహ్ యొక్క భయభక్తుల వైపుకు పిలవాలి.

d)   ఖుత్బా అల్లాహ్ పై విశ్వాసము దృఢపరిచే విధంగా ఉండాలి.

e)    ఆ సమయపు కష్టముల నుండి, తప్పుల నుండి దూరం అయ్యే విధంగా ప్రజలకు సూచనలు చేయాలి.

f)    ఖతీబ్ తన కొరకు మరియు ముస్లింల కొరకు అల్లాహ్ తో క్షమాపణ కోరాలి, “అస్తగ్ ఫిర్ అల్లాహ్” అంటే “ఓ అల్లాహ్ నన్ను, మమ్మల్ని క్షమించు” అనాలి.

g)   ఖుత్బా క్లుప్తంగా మరియు ఆ సమయానుసారం హితబోధ అయి ఉండాలి.

గమనిక: కొంచెం బిగ్గరగా ఖుత్బా ప్రసంగం చేయడం చాలా ఉత్తమం.

h)   రెండవ ఖుద్బాకి ముందు ఖతీబ్ కొంచెం సేపు కూర్చోవలెను.

i)     మళ్ళీ నుంచొని 2వ ఖుత్బా ఇన్నల్ హందులిల్లాహ్ – అల్లాహ్ స్తోత్రములతో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై సలాంతో మరియు కొన్ని ఖుర్ఆన్ వచనాలతో ప్రారంభించాలి.

j)     జుమహ్ సలాహ్ లో అప్పుడప్పుడు సూరె ఆలా మరియు సూరె గాషియ చదువుట సున్నత్.

k)   జుమహ్ ప్రసంగం ప్రారంభము కాకముందు మస్జిద్ లో చేరాలి.